Stress: ఒత్తిడిని దీర్ఘకాలం పాటు సాగితే మానసిక సమస్యలు రావొచ్చు
ఒత్తిడి లేని ఉద్యోగాలు లేవు. కానీ దాన్ని అధిగమించేందుకు ప్రయత్నించకపోతే మాత్రం మానసికంగా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇప్పుడు ఒత్తిడి లేని జీవితం లేదు. మనిషి రోజువారీ జీవితం ఒత్తిడిలో కూరుకుపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఒత్తిడి క్లిష్టమైన పరిస్థితి నుంచి ఏర్పడే మానసిక ఆందోళన స్థితి. ఇది నిరంతరంగా కొనసాగితే దీర్ఘకాలిక ఒత్తిడికి దారి తీస్తుంది. దీని వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
దీర్ఘకాలిక ఒత్తిడి సంకేతాలు
ఒత్తిడి భయం, ఆందోళన, చిరాకు అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. Taతలనొప్పి, శరీర నొప్పులు, ఆహారపు అలవాట్లలో మార్పు, నిద్రపోవడంలో ఇబ్బంది వంటి అనేక శారీరక లక్షణాలను కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటుని ప్రభావితం చేస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు బానిసగా మారే ప్రమాదాన్ని పెంచుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి శారీరక, మానసిక శ్రేయస్సుని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
⦿మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటిస్
⦿ఇంటర్నెట్, అతిగా తినడం, జూదానికి బానిసలు కావడం
⦿ఆల్కాహాల్, పొగాకు ఉత్పత్తులు వినియోగించడం
⦿ఆందోళన, నిద్రలేమి, నిరాశ
⦿అధిక రక్తపోటు
శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
మస్క్యులోస్కెలెటల్ సిస్టమ్: ఒత్తిడి సమయంలో కండరాలు సంకోచించబడతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా శరీరం తీవ్ర అలసటకు గురవుతుంది. మెడ, భుజాల కండరాలు ఒత్తిడికి లోనై తలనొప్పి రూపంలో స్పష్టంగా కనిపిస్తుంది.
శ్వాసకోశ వ్యవస్థ: ముక్కు, ఊపిరితిత్తుల మధ్య మృదువైన శ్వాసకోశ కండరాలు ఒత్తిడి గురైనప్పుడు తీవ్రంగా సంకోచిస్తాయి. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా వేగంగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఉబ్బసం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో ఒత్తిడి వల్ల పరిస్థితి దిగజారే అవకాశం ఉంది.
హృదయనాళ వ్యవస్థ: ఒత్తిడి ఎక్కువగా హృదయ నాళ వ్యవస్థ మీద పడుతుంది. అధిక రక్తపోటు సంభవిస్తుంది. ఒత్తిడి హార్మోన్లు అడ్రినలిన్, నోరాడ్రినలిన్, కార్టిసాల్ విడుదలకు దారితీస్తాయి. ఇవి శరీరాన్ని ప్రమాదంలో పడేస్తాయి. ఈ హార్మోన్ల విడుదల హృదయ స్పందన రేటు పెరుగుదల, రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉంటుంది.
జీర్ణాశయాంతర వ్యవస్థ: గట్ లో మిలియన్ల న్యూరాన్ మీద ఒత్తిడి పడినప్పుడు తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. అధిక ఒత్తిడి GI వ్యవస్థ, మెదడు మధ్య కనెక్షన్ ను ప్రభావితం చేస్తుంది. ఇది నొప్పి, ఉబ్బరం యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వాటి బారిన పడే ప్రమాదాన్ని తీసుకొస్తుంది.
పునరుత్పత్తి వ్యవస్థకి ఆటంకం: ఒత్తిడి వల్ల టెస్టోస్టెరాన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది లిబిడో రూపంలో వ్యక్తమవుతుంది. స్పెర్మ్ కౌంట్ మీద కూడా ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల స్త్రీ గర్భం ధరించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రుతువిరతి సమయంలో ఆందోళన, మానసిక కల్లోలం, బాధ వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఇది మహిళల్లో మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ALso Read: వేసవిలో మలబద్ధకం సమస్యను దూరం పెట్టాలంటే ఈ సూపర్ డ్రింక్స్ తాగేయండి