Summer Skin care : సన్‌స్క్రీన్‌ను కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే దానిని మీరు అప్లై చేసినా వేస్టే
Sunscreen : సమ్మర్లో స్కిన్ కేర్ చాలా ముఖ్యం. లేదంటే స్కిన్ టాన్ అయిపోయి.. మీ సహజమైన రంగును కోల్పోవాల్సి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలతో మీ చర్మాన్ని ఎలా రక్షించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Healthy Skin with Sunscreen : వేసవికాలం ప్రారంభమైపోయింది. మార్చినెల కూడా రాకముందే భానుడు ఓ రేంజ్లో విజృంభిస్తున్నాడు. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలతోపాటు స్కిన్ సమస్యలు కూడా వస్తాయి. అలా అని బయటకు వెళ్లకుండా ఉండలేము కదా. ఎన్నో పనులు మనల్ని బయటకి తీసుకువెళ్తూ ఉంటాయి. అయితే మీరు బయటకు వెళ్లేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు స్కిన్‌ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.
స్కిన్ కేర్‌లో ముఖ్యంగా సమ్మర్లో మనం మాట్లాడుకోవాల్సింది సన్‌స్క్రీన్ గురించే. ఎందుకంటే ఇది లేకుండా మీరు బయటకు వెళ్తే.. ఇంటికి వచ్చాక మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేనంత టాన్ ముఖంపై పేరుకుపోతుంది. సన్‌స్క్రీన్ అప్లై చేయడమంటే ఏది పడితే అది వాడడం కాదు. మీ చర్మానికి ఏది సెట్ అవుతుందో చెక్ చేసుకుని దానిని వాడితే మంచిది. అప్పుడే మీ చర్మం సూర్య కిరణాల వల్ల దెబ్బతినకుండా ఉంటుంది. లేదంటే చర్మంపై కాలిన గుర్తులు, ఇతర ప్రతికూల ప్రభావలకు చర్మం గురి అవుతుంది.
మీరు ఎక్కువ సమయంలో సూర్యరశ్మిలో గడపాల్సి వస్తే వాటి ప్రభావాలు కూడా దీర్ఘకాలికంగానే ఉంటాయి. కొందరు నల్లమచ్చలు, పిగ్మెంటేషన్, ముడతల, ఫైన్ లైన్స్ వంటి వృద్ధాప్య సంకేతాలు పొందుతారు. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మీరు కచ్చితంగా డెర్మాటాలజిస్ట్ని కలిసి మీ స్కిన్ గురించి తెలుసుకోవాలి. వారు మీకు, మీ చర్మానికి సెట్ అయ్యే సన్‌స్క్రీన్‌ను మీకు సజెస్ట్ చేస్తారు.
సన్‌స్క్రీన్ ఎందుకు వాడాలంటే..
ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మం తేమను కోల్పోతుంది. ఈ సమయంలో సన్స్క్రీన్లు లోపలి నుంచి హైడ్రేషన్‌ను అందిస్తాయి. ఇవి మీ చర్మాన్ని పొడిబారకుండా చేసి తాజాగా ఉండేలా చేస్తాయి. అందుకే మీరు బయటకు వెళ్లే ముందు కచ్చితంగా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. దీనితో పాటు మాయిశ్చరైజర్‌ను అప్లై చేస్తే స్కిన్‌కి చాలా మంచిది. పొడి చర్మం ఉన్నవారికి ఇది మంచి హ్యాక్. అంతేకాకుండా సన్‌స్క్రీన్ సూర్యుని నుంచి వచ్చే కిరణాలను నేరుగా శరీరంపై పడకుండా చేస్తుంది. యూవీ కిరణాల నుంచి అదనపు రక్షణను ఇస్తుంది.
సన్‌స్క్రీన్ ఎంచుకోవడంలో SPF
సన్‌స్క్రీన్ మీరు వాడాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ కౌంటర్ చెక్ చేసుకోవాలి. అందుకే చాలా సన్స్క్రీలు ఈ కౌంట్నే ఎక్కువగా మార్కెట్ చేస్తాయి. ఈ కౌంటర్ చర్మానికి సున్నితత్వాన్ని అందిస్తూ.. సూర్యరశ్మి నుంచి రక్షిస్తుంది. చాలామందికి SPF 20 లేదా 25 సెట్ అవుతుంది. అయితే మీరు సెన్సిటివ్ స్కిన్, ర్యాషెష్, డార్క్ స్పాట్స్ ఎక్కువగా కలిగి ఉంటే SPF 30 లేదా 40 ఉపయోగించవచ్చు. SPF 50, 60 సన్స్క్రీన్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి.
స్కిన్‌ని బట్టి ఎంచుకోండి..
సన్‌స్క్రీన్‌ను కొనేముందు మీరు మీ చర్మ రకాన్ని ముందుగా పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మీరు దానిని వాడినా పెద్ద ఉపయోగం ఉండదు. సన్స్క్రీన్లు, సన్బ్లాక్లు రెండూ లోషన్, క్రీమ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి పొడి చర్మం ఉన్నవారికి బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే ఇవి బాగా హైడ్రేటింగ్ను చర్మానికి అందిస్తాయి. అయితే మాయిశ్చరైజర్‌ను అప్లై చేసి సన్‌స్క్రీన్ అప్లై చేస్తే మంచిది. మీకు ఆయిల్ స్కిన్ ఉంటే.. బ్రేక్‌అవుట్‌లు, రంధ్రాలు ఇబ్బంది కలిగించకుండా ఆయిల్ ఫ్రీ సన్‌స్క్రీన్ జెల్‌ని ఉపయోగించవచ్చు.
అప్లై ఎక్కడ చేయాలంటే..
సూర్యునికి బాగా ఎక్స్పోజ్ అయ్యే ప్రాంతాల్లో సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ముఖం, మెడ, చేతులు వంటి బహిర్గత శరీర భాగాలపై దీనిని అప్లై చేయాలి. మీరు ఎండలోకి వెళ్లే 10 నిమిషాల ముందు దానిని అప్లై చేయండి. మీరు గంట కంటే ఎక్కువ ఎండలో ఉంటే మరోసారి సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటవరకు ఎండలో తిరగకపోవడమే మంచిది.
Also Read : మీకు ఎల్లో టీ గురించి తెలుసా? ఇది హెల్త్ బెనిఫిట్స్‌కి పెట్టింది పేరు