Good Sleep Tips: నిద్ర రావటం కష్టమవుతోందా? ఇలా చేసి చూడండి
Sleeping Tips In Telugu : అలసటగా గడిచిన రోజుకు పూర్తి విశ్రాంతి నిచ్చి మరుసటి రోజుకు తాజాగా స్వాగతం పలకాలంటే రాత్రి తగినంత నిద్ర చాలా అవసరం.
Health Tips In Telugu | ఈరోజుల్లో జీవిత వేగం బాగా పెరిగింది. వేగవంతమైన ఉరుకుపరుగుల మధ్య నిద్ర లేమి అనేది చాలా సాధారణమై పోయింది. కలతలేని నిద్ర అందకుండ పోతోంది చాలా మందికి. నిద్ర లేమి చాలా తీవ్రమైన అనారోగ్యాలకు కారణం కాగలదు. నిద్రలేమి ఎంత సాధారణమో అధిగమించడానికి కూడా అంతే స్థాయిలో మంచి మంచి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేమిటో అవగాహన ఉంటే నిద్ర పట్టక పోవడం సమస్యగా అనిపించకపోవచ్చు.
నిద్ర గురించి ఆయుర్వేదం చెప్పే విషయాలు..
నిద్ర, ఆహారం ఆరోగ్యానికి మూల స్థంభాలు. మంచి నిద్ర ఉంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా. అష్టాంగ హృదయం అనే ఆయుర్వేద గ్రంథంలో నిద్రప్రాముఖ్యత గురించి చాలా విషయాలు చర్చించారు.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర చాలా అవసరం. జీర్ణక్రియ సజావుగా సాగితే శరీరానికి కావల్సిన పోషకాలు అందతాయి. నిద్ర తో ఒత్తిడి దూరమవుతుంది. తగినంత నిద్రతో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఫలితంగా శరీరానికి వ్యాధికారక క్రిములతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. మెదడు పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
ఇలా చేసి చూడండి
సులభంగా నిద్ర పట్టేందుకు ఆయుర్వేదం కొన్ని చిన్న చిన్న చిట్కాలను సూచిస్తోంది. వీటిని పాటిస్తే ఎలాంటి మందుల అవసరం లేకుండానే సులభంగా నిద్ర పోవచ్చు.
- నిద్రకు ఉపక్రమించేందుకు మందే గోరువెచ్చని నీటితో స్నానం చెయ్యడం వల్ల శరీరంలో అలసట తీరి మంచి నిద్ర వస్తుంది.
- నిద్ర సమయానికి కనీసం రెండు గంటల మందు మీరు రాత్రి భోజనాన్ని పూర్తిచెయ్యాలి. ఎందుకంటే ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియ శరీరంలో జరుగుతున్నపుడు నిద్ర రాకపవోచ్చు. శరీరంలో జీర్ణవ్యవస్థ చురుకుగా పని చేస్తుంటే నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. కనుక త్వరగా రాత్రి భోజనాన్ని ముగించడం చాలా అవసరం.
- రాత్రి భోజనం తర్వాత 15 -20 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చుంటే జీర్ణక్రియ మెరుగ్గా జరిగి నిద్రకు ఆటంకం కలిగించదు.
- గోరు వెచ్చని నీటిలో పాదాలను కాసేపు ఉంచడం వల్ల రక్తప్రసరణ మెరుగు పడి త్వరగా నిద్ర పడుతుంది.
- పాదాలకు తేలికపాటి మసాజ్ చెయ్యడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అలసట తీరిపోయి మంచి నిద్ర వస్తుంది. నువ్వుల నూనెను మసాజ్ కు ఉపయోగించడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.
- నిద్రకు ముందు ఏదైనా పుస్తకం చదవడం వల్ల కూడా మంచి పలితం ఉంటుంది.
- నిద్ర లేమికి వ్యాయామ లేమి కూడా కారణం కావచ్చు. కనుక ప్రతిరోజూ తప్పకుండా కనీసం అరగంట పాటు వ్యాయామం చెయ్యాలి.
- కెఫిన్, ఆల్కహాల్ వాడకం కూడా వీలైనంత తగ్గించడం ద్వారా నిద్ర నాణ్యత పెంచుకోవచ్చు.
- నిద్ర సమయానికి గంట మందు నుంచి స్క్రీన్ ఉపయోగించడం మానెయ్యాలి. అంటే లాప్టాప్, మొబైల్, టీవి వంటి గాడ్జెట్స్ అసలు వాడకూడదు.
తగినంత పోషకాహారం, ప్రతిరోజూ వ్యాయామం, 7-8గంటల నిద్ర శరీరాన్ని ఆరోగ్యంగా, అందంగా, చాలా కాలం పాటు యవ్వనంగా ఉంచుతుంది.