Winter and Heart Attacks : చలికాలంలో గుండెపోటు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నవారికీ కూడా ప్రమాదమేనట
Heart Attack Deaths Rise in Winter : గుండెపోటు మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ గణాంకాలు శీతాకాల నెలల్లో ఎక్కువగా కనిపిస్తాయట. కారణాలు ఏంటో చూసేద్దాం.

Winter Triggers Heart Attacks : ఇండియాలో ప్రతిరోజూ చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ఈ సంఖ్య తగ్గడానికి బదులు రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చలికాలంలో ఈ గణాంకాలు గణనీయంగా పెరుగుతాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ప్రధానంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అయితే ఎవరికైనా కొలెస్ట్రాల్ స్థాయిలను నార్మల్ ఉంటే.. వారికి గుండె జబ్బులు రావని బాధపడతారు. కానీ అది పూర్తిగా తప్పని చెప్తున్నారు వైద్యులు. కొలెస్ట్రాల్‌తో పాటు గుండెపోటు మరణానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
శీతాకాలంలో గుండెపోటు మరణాలు
అనేక అధ్యయనాల ప్రకారం.. చలి కాలంలో అత్యధిక సంఖ్యలో గుండెపోటులు సంభవిస్తాయి. ఎందుకంటే శరీరాలు చల్లగా ఉండటానికి రక్త నాళాలు, సిరలు సంకోచిస్తాయి. దీనివల్ల తగినంత రక్తం, ఆక్సిజన్ మన హృదయాలను చేరకుండా ఉంటుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ వంటి ప్రతి అంశం సాధారణంగా ఉన్నప్పటికీ.. గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.
ప్లాస్మా
అదనంగా చలి వాతావరణంలో శరీరంలో ప్లాస్మా పరిమాణం పెరుగుతుంది. ఎందుకంటే మనం చలిలో తక్కువగా చెమట పడతాము. ఇది శరీరంలో రక్త పరిమాణాన్ని పెంచుతుంది. ఈ పెరిగిన మొత్తం గుండెపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతుంది.
ఆహారపు అలవాట్లు
శీతాకాలంలో ఎక్కువమంది ఎక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకునేందుకు ఇష్టపడతారు. వేడివేడిగా డీప్ ఫ్రై చేసిన ఈవెనింగ్ స్నాక్స్ తింటారు. ఈ సమయంలో జీవక్రియ మందగించడం వల్ల.. బరువు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.
హార్మోన్ల హెచ్చుతగ్గులు
శీతాకాలంలో హార్మోన్లు కూడా గణనీయమైన హెచ్చుతగ్గులకు గురవుతాయి. రక్తం గడ్డకట్టడానికి దారితీస్తాయి. ఈ గడ్డ మన గుండె సిరల్లో చిక్కుకుంటే.. ఆ అడ్డంకి గుండెపోటుకు దారితీస్తుంది. ఇప్పటికే అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు శీతాకాలంలో అదనపు జాగ్రత్త వహించాలి. అలాంటివారు ఉప్పు తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ పని చేయాలి. జీర్ణమవడానికి ఎక్కువ సమయం అవసరమయ్యే ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
వేయించిన ఆహారాలు తినకూడదు. నిద్ర కనీసం 7 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోవాలి. ఏవైనా లక్షణాలను గమనించినట్లయితే వాటిని విస్మరించవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోండి. వీలైనంత తక్కువగా బయటకు వెళ్లండి. వీలైనంత వరకు వ్యాయామం చేయండి. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి.. గుండెకు రక్తసరఫరా బాగుంటుంది. హెల్తీ ఫుడ్, ఫ్రెష్గా వండిన ఆహారం తీసుకుంటే మరీ మంచిదని చెప్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















