Bus Train: ఏం బుర్ర గురూ.. ఈ బస్సు రోడ్‌పైనే కాదు, పట్టాలపై కూడా పరుగులు పెడుతుంది
జపాన్ ప్రపంచంలోనే తొలి ‘బస్ ట్రైన్’ను సిద్ధం చేసింది. ఇది రోడ్ మీదే కాదు.. రైలు పట్టాలపై కూడా పరుగులు పెడుతుంది.
మీరు చిన్నప్పుడు అనుకొనే ఉంటారు.. రైళ్లెందుకు రోడ్డుపై పరిగెట్టవు? బస్సులెందుకు పట్టాలెక్కవు అని. పెద్దాయ్యక అది అసాధ్యమని కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. రైళ్లు ఎప్పుడూ పట్టాల మీదే ప్రయాణించాలి. బస్సులు ఎప్పుడూ.. రోడ్లపైనే పరిగెట్టాలనే జీవిత సత్యాన్ని కూడా మీరు తెలుసుకొనే ఉంటారు. అయితే, ఇకపై మీ పిల్లలకు.. రైళ్లు పట్టాల మీదే కాదు, రోడ్లు మీద కూడా ప్రయాణించగలవు. వాటినే ‘బస్ ట్రైన్’ అంటారని చెప్పాలి. ఒక వేళ మీ పిల్లలు ఆ బస్-ట్రైన్ ఎక్కుతానని మారం చేస్తే మాత్రం కష్టమే. ఎందుకంటే.. ఆ బస్ ట్రైన్లు ప్రస్తుతం జపాన్‌లో ఉన్నాయి.
ఏది ఏమైనా.. జపాన్ వాళ్లది బుర్రంటే బుర్రేనండి. వాళ్లు ఏం చేసిన చాలా ఇన్నోవేటివ్‌గా ఉంటుంది. ఒక్క టికెట్‌కు రెండు సినిమాలు అన్నట్లు.. ఒక్క టికెట్‌తో ప్రయాణికుడు.. రైలు, బస్సులో తిరిగిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ప్రపంచంలోని తొలి ‘డ్యూయల్ మోడ్ వెహికిల్’ (Dual Mode Vehicle-DMV)ను జపాన్ ఇటీవల పరిచయం చేసింది. ఇది రోడ్డు మీద, పట్టాలపై కూడా ప్రయాణించగలదు. ఈ అరుదైన ‘బస్ ట్రైన్’ హైబ్రీడ్‌ను గత నెల కియోలో ప్రారంభించారు.
రోడ్డు, పట్టాలపై ప్రయాణించేందుకు వీలుగా ఈ బస్సు చక్రాలను రూపొందించారు. ఈ బస్సు రోడ్డుపై నుంచి పట్టాలు ఎక్కగానే.. దాని ముందు ఉండే.. ఇంజిన్ భాగం నుంచి ఇనుక చక్రాలు కిందికి దిగి బస్సును పైకి ఎత్తుతాయి. అయితే, వెనుక చక్రాలు మాత్రం యథావిధిగా ఉంటాయి. రైలు ప్రయాణించేంత వేగంతోనే ఆ బస్సు కూడా ప్రయాణిస్తుంది. కేవలం రైలు, బస్సు నడపడంలో అనుభవం ఉన్న డ్రైవర్లుకు మాత్రమే ఈ వాహనాన్ని నడిపేందుకు అవకాశం ఇస్తారు.
ఈ బస్ ట్రైన్ గురించి అశ కోస్ట్ రైల్వే సీఈవో షిగేకి మియురా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఈ డీఎంవీ లోకల్ ఏరియాలో బస్సులా తిరుగుతుంది. ఆ తర్వాత ప్రయాణికులతో పట్టాలెక్కి దూరు ప్రాంతాలకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక వారు బస్సులో రైల్వే స్టేషన్‌కు వెళ్లి.. రైలు కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. నేరుగా బస్సులోనే పట్టాలపై ప్రయాణం చేయొచ్చు’’ అని తెలిపారు. ఈ బస్ ట్రైన్.. ఒకేసారి 21 మంది ప్రయాణికులతో ప్రయాణించగలదు. ట్రైన్‌గా మారినప్పుడు గంటకు 60 కిమీల వేగంతో ప్రయాణిస్తుంది. రోడ్డుపై గంటలకు వంద కిమీలతో దూసుకెళ్తుంది.