Brinjal: వంకాయ తింటే కొందరిలో అలర్జీ వస్తుందా? ఆ అలర్జీ ప్రాణాంతకమా?
ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పడని ఆహారం తీసుకుంటే అది ప్రాణాల మీదకు తీసుకొస్తుంది.
వంకాయ తినేందుకు చాలా మంది ఇష్టం చూపించరు. కానీ ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి రక్షణగా నిలుస్తుంది. ఇందులోని బయోయాక్టివ్ కాంపౌండ్స్, పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6 ఉన్నాయి. ఇవి గుండెకి రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వంకాయ తింటే కొంతమందికి వెంటనే అలర్జీ వస్తుంది. వంకాయ వల్ల వచ్చే ఫుడ్ అలర్జీని తేలికగా తీసుకుంటే ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఇతర ఆహార అలర్జీల మాదిరిగానే దీని లక్షణాలు ఉన్నప్పటికీ అనేక శారీరక విధులకు ఆటంకం కలిగిస్తుంది.
వంకాయ వల్ల కలిగే అలర్జీలు
☀చర్మం అంతటా దద్దుర్లు వ్యాపిస్తాయి
☀గొంతులో దురద, వాపు
☀కళ్ళు ఎరుపు రంగులోకి మారిపోవడం
☀వికారం, వాంతులు
అమెరికన్ అకాడమీ ఆఫ్ అలర్జీ ప్రకారం ఆస్తమా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళలో వంకాయ వల్ల కలిగే అలర్జీ చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. వాటిలో కొన్ని..
దద్దుర్లు
సున్నితనమైన చర్మ రకం కలిగిన వాళ్ళు వంకాయ తినడం వల్ల దద్దుర్లు వస్తాయి. ఇవే కాదు గొంతు బొంగురుపోవడం, కంటి దురద, గురక, జీర్ణాశయాంతర సమస్యలు ఎదురవుతాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
వంకాయ అలర్జీ అనేక సందర్భాల్లో అనాఫిలాక్సిన్ కు కారణమవుతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడతారు. వెంటనే వైద్య చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఇవే కాదు గురక, మైకం, పల్స్ పడిపోవడం కూడా జరగవచ్చు.
నాలుక, పెదాల వాపు
పొట్లకాయ తింటే కొంతమంది ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అయితే వంకాయ అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా నాలుక, పెదవులు, గొంతు వాపు ఏర్పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం నోటి పూత, నోట్లో మంట కూడా కలుగుతుంది.
రక్తపోటు తక్కువ
వంకాయలో నాసునిన్ ఉంటుంది. ఇది ఒక రకమైన ఫైటోకెమికల్. ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళు వంకాయ తీసుకున్నప్పుడు అత్యల్ప రక్తపోటుని ఎదుర్కొంటారు. ఇది మాత్రమే కాదు వీటిలో ఉండే ఆక్సీలెట్స్ కిడ్నీలో రాళ్ళని కూడా ఏర్పరుస్తుంది.
వంకాయ అలర్జీ ఎవరికి వస్తుంది?
టొమాటో, బంగాళాదుంప, పెప్పర్ అంటే అలర్జీ కలిగిన వాళ్ళకి వంకాయ తిన్న కూడా పడదు. ఇటువంటి అలర్జీ చిన్నతనంలోనే వస్తుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత సడెన్ గా అది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అలర్జీ నుంచి బయట పడటం ఎలా?
వంకాయ తిన్నప్పుడు కనిపించే లక్షణాలు తీవ్రంగా, ప్రమాదకర రూపు దాలిస్తే వెంటనే వైద్యులని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే రక్తపరీక్ష ద్వారా మీకు నిజంగా అలర్జీ ఉందో లేదో చెక్ చేయించుకోండి. వైద్యుల సలహా ప్రకారం వంకాయ తీసుకోకుండా ఉండటం లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు పాటించడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ కూరగాయల విత్తనాలు రోస్ట్ చేసుకుని తిన్నారంటే టేస్ట్ అదుర్స్