Eggs: గుడ్డు గుండెకు హానికరమా? అతిగా తింటే అంతే సంగతులా?
గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో పోషకాలు అందుతాయి. కానీ అతిగా తింటే అనారోగ్య సమస్యలు తీసుకొస్తుంది.
రోజుకో కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో తప్పనిసరిగా ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్ తీసుకుంటారు. కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, అనేక ఇతర పోషకాలతో నిండిన గుడ్లు తీసుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేసిన తర్వాత ఎక్కువ మంది కోడి గుడ్డు పగలగొట్టుకుని పచ్చిది తాగేస్తారు. మరి కొంతమంది ఉడకబెట్టిన గుడ్లు ఒకేసారి అరడజనుకి పైగా ఆరగిస్తారు. అలా గుడ్లు ఎక్కువగా తినడం మంచిదేనా? అంటే కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే గుడ్డు వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయట. గుడ్డు సొనల్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు, గుండె పోటు వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. యూఎస్ నివేదిక ప్రకారం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఉన్న వ్యక్తులు రోజుకి 200 ఎంజీ కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ తీసుకోవడం మంచిది కాదు. మయో క్లినిక్ ప్రకారం కాలేయం ఆహారంలోని సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్ ద్వారా కొలెస్ట్రాల్ ని తయారు చేస్తుంది. గుడ్డులో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. రోజుకు ఒక గుడ్డు తింటే చాలు కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపు చేసుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
గుడ్డులోని సొన పూర్తిగా కొలెస్ట్రాల్ తో తయారవుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే ఉడికించిన గుడ్లు తిన్నా కూడా కొవ్వు స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుడ్లు అతిగా తినడం దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
హెల్త్ లైన్ ప్రకారం ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ అవసరం. అయితే అధిక స్థాయిలు మాత్రం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తసరఫరాకి ఆటంకం ఏర్పరుస్తుంది. ధమనుల ద్వారా తగినంత రక్తం ప్రవహించడం కష్టతరం చేయడం వల్ల గుండె పోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అలా అని గుడ్లు తినొద్దని కాదు మితంగా తీసుకోమని వైద్యులు సూచిస్తున్నారు. కరొనరీ ధమనుల్లో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఛాతీ నొప్పి వస్తుంది. గుండె పోటు మాదిరిగానే మెదడులోని భాగానికి రక్త ప్రవాహం ఆగిపోతే స్ట్రోక్ వస్తుంది.
రోజు గుడ్డు తినడం వల్ల ప్రయోజనాలు
రోజుకొక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలని అందిస్తుంది. ఉడికించిన గుడ్డు సుమారు 77 కేలరీలు కలిగి ఉంటుంది. గుడ్డులో విటమిన్లు ఏ, బి 5, బి 12, డీ, ఇ, కె, బి 6తో పాటు ఫోలేట్, భాస్వరం, సెలీనియం, కాల్షియం, జింక్, ఆరు గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. గుడ్డులో కొలిన్ అనే నీటిల్ కరిగే విటమిన్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది.
గుడ్డు సొనలో మంచి మొత్తంలో లుటిన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి చూపును కాపాడుకోవడంలో సహాయపడతాయి. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్లు, అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తపోటుని తగ్గిస్తాయి. ఎముకలని బలోపేతం చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: మధుమేహాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు ప్రయత్నించండి