ఈ మొక్కలు మీ గార్డెన్లో ఉంటే పాములు పరార్, ఎంతో సురక్షితం కూడా!
పెరట్లో కాసేపు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ మొక్కలు ఉన్న చల్లదనానికి పాములు వచ్చేస్తే వామ్మో పరుగో పరుగు. వాటిని రాకుండా చేయాలంటే ఇదిగో మార్గం.
మొక్కలు పెంచుకోవడం అంటే అందరికీ ఇష్టమే. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో గార్డెన్ పెంచుకుంటూ ఉంటున్నారు. పచ్చని మొక్కల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో కాసేపు హాయిగా కూర్చుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంతా బాగానే ఉంది కానీ ఆ మొక్కల పొదలు ఉన్న దగ్గరకి పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. తడిగా, దట్టమైన ఆకులతో కప్పబడి ఉండే ప్రదేశాలని పాములు ఎక్కువగా ఇష్టపడతాయంట. మీకు తెలియకుండానే అవి మీ గార్డెన్ లోకి వచ్చి చెరిపోతాయి. అవి వచ్చిన విషయం మీరు పసిగట్టలేరు. కానీ మీరు గార్డెన్ లోకి వెళ్ళినప్పుడు అవి పసిగట్టి హాని చేసే ప్రమాదం ఉంది. విషపూరిత సర్పాలు అయితే మరింత ప్రమాదంగా మారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అందుకే గార్డెన్లో తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు.
గార్డెన్ లోకి పాములు రాకుండా చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే అవి మీ మొక్కల దగ్గరకి రావడం అసాధ్యం. అదేంటంటే.. పాములకి ఇష్టం లేని మొక్కలు మీ గార్డెన్‌లో ఉండేలా చూసుకుంటే చాలు. పాము వికర్షక మొక్కలు గార్డెన్లో పెంచడం వల్ల ఆ వాసనకి అవి రాకుండా పారిపోతాయి.
హోలీ(Holly)
పాము వికర్షక మొక్కల్లో మొదటిది హోలీ. ఇదేదో పండగ కదా మొక్క అంటారెంటి అని అనుకుంటున్నారా కానీ ఇది నిజం. ఇది ఒక మొక్క. చాలా తక్కువ ఎత్తులోనే ఇది పెరుగుతుంది. కానీ ఈ మొక్క పాములు రాకుండా నిరోధిస్తుంది. మీ పెరట్లో ఈ మొక్కని పెంచడం చేస్తే పాములు పారిపోవాల్సిందే. కానీ నెలకి ఒకసారి అయినా ఆ మొక్క పొద మాత్రం శుభ్రం చెయ్యాలి. దాని ఆకులు కూడా పెరట్లో వెదజల్లవచ్చు.
మేరిగోల్డ్స్(Marigolds)
ఫ్రెంచ్, అమెరికన్ మేరిగోల్డ్ రెండూ బలమైన ఘాటు వాసన కలిగి ఉంటాయి. ఎరుపు, పసుపు, నారింజ రంగులను కలిగి ఉంటాయి. ఇవి పాములను బాగా దూరంగా ఉంచుతాయి. ఈ మొక్క పూలు చూసేందుకు చాలా మనోహరంగా ప్రకాశవంతంగా ఉంటాయి. పాములని తిప్పికొట్టే ఘాటైన వాసన ఇవి విడుదల చేస్తాయి. పాము దాక్కున చోటికి కూడా ఈ వాసన వెళ్లగలదు. కనుక అవి మట్టిలో ఎక్కడైనా దాక్కున్నా కూడా అక్కడికి కూడా వాసన వెళ్ళిపోయి వాటిని ఇబ్బంది పెట్టేస్తుంది.
వెల్లుల్లి
ఉల్లిపాయ, అల్లియం మాదిరిగానే వెల్లుల్లిలో కూడా అధిక పరిమాణంలో సల్ఫోనిక్ ఆమ్లం ఉంది. ఈ వాసన సర్పాలకు అసలు ఇష్టం ఉండదు. కూరల్లో తప్పకుండా వెల్లుల్లి వేసుకుంటారు. ఇది వంటలకి అదనపు రుచి ఇవ్వడమే కాదు పాములని పారిపోయేలా చేస్తుంది. వెల్లుల్లి మొక్కల పువ్వులు కూడా అందంగా ఉంటాయి.
అల్లియం
ఇందులో ఉండే అధిక సల్ఫోనిక్ కంటెంట్, ఘాటైన వాసన కారణంగా పాములను చాలా దూరంగా ఉంచడంలో సహకరిస్తుంది. లావెండర్ కలర్లో ఉండే ఈ మొక్క పువ్వు చూసేందుకు చాలా ముద్దుగా కనిపిస్తుంది. పాములు, నత్తలు ఈ మొక్క ఉన్న ప్రదేశాలకి రాలేవు.
లెమన్ గ్రాస్
పాములనే కాదు కందిరీగలు కూడా వీటి దరి చెరలేవు. లెమన్ గ్రాస్ శ్రీలంగ్, దక్షిణ భారతదేశంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. తేమ, వెచ్చని వాతావరణం వీటికి అనువుగా ఉంటుంది. పాములను దూరంగా ఉంచే సిట్రస్ సువాసన వెదజల్లుతుంది.
ఇవే కాదు స్నేక్ ప్లాంట్, వార్మ్ వుడ్, పింక్ అగాపంథస్, బసిల్ వంటి అనేక మొక్కలు కూడా మీ పెరట్లో పెంచుకోవడం వల్ల సర్పాలు రాకుండా చేయవచ్చు. హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎంజాయ్ చేయొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?