Banana Benefits: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
అరటి పండుని పూజలో నైవేద్యంగా మాత్రమే చూడకండి... రోజుకో అరటి పండు తినడం వల్ల ఎన్ని లాభాలో చదివి తెలుసుకోండి.
బ్రెడ్స్, కుకీస్, స్కూతీస్, చిప్స్, మిల్క్ షేక్స్... ఇలా అరటి పండు లేదా అరటికాయని రకరకాల ఆహారపదార్థాల రూపంలో తీసుకుంటాం. వాటిని అలా తినేకన్నా అరటి పండుగానో లేక అరటికాయని కూరగానో వండుకుని తింటేనే శరీరానికి మంచిపోషకాలు అందుతాయి. వీటిలో ప్రోటీన్, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, షుగర్... ఇలా చాలా పోషకాలు దీనిద్వారా అందుతాయి. అయితే మధుమేహురోగులు చక్కెర కారణంగా ఈ పండును దూరం పెడతారు. మరికొంతమంది బరువు పెరుగుతారనే కారణంగా తినరు. కానీ ఓ అధ్యయనం మాత్రం అరటి పండు లేదా కాయని రోజూ ఏదో రకంగా తినమని సిఫారసు చేస్తోంది. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలన్నీ దూరమవుతాయని చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం జీర్ణక్రియ సంబంధింత ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, క్రోన్స్ వ్యాధిని దూరం చేయగల సత్తా అరటిపండుకే ఉంది. బాల్యంలో మనం తినే ఆహారమే పెద్దయ్యాక మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి బాల్యంలో లేదా టీనేజీ వయసులో మంచి ఆహారాన్ని తినమని, అందులో రోజూ కచ్చితంగా అరటి పండు తినమని ఆ అధ్యయనం సూచిస్తోంది. అధిక కొవ్వు ఉండే ఆహారాలు, అత్యధిక తీపి పదార్థాలను తినే అలవాటున్న వారికి పేగు వ్యాధి, పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. తరచూ పేగుల వాపు కూడా వస్తుంది. పొట్టలో పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు అరటి పండు మంచి పరిష్కారం. రోజుకో అరటి పండు తినడం ఇక అలవాటుగా మార్చుకుంటే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారవుతారు.
అధ్యయనం ప్రకారం అరటిపండ్లు పేగుల్లో బ్యూటిరేట్ అనే ఫ్యాటీ యాసిడ్ ఉత్పత్తి ప్రోత్సహిస్తాయి. ఈ ఆమ్లం పొట్ట, పేగుల ఆరోగ్యానికి అత్యవసరం. దీనివల్ల పొత్తికడుపు నొప్పి రావడం వంటి సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు ఈ ఫ్యాటీ ఆమ్లం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ బారిన చాలా తక్కువ పడతారని కూడా పరిశోధకులు తేల్చారు. కాబట్టి షుగర్ ఉన్న వాళ్లు కూడా రెండు రోజుకోసారైనా అరటి పండు తింటే మంచిది. అలాగే బరువు పెరుగుతామన్న భయం కూడా లేకుండా రోజులో పండును తింటే మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి