Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలా? ఈ ఆయుర్వేద మార్గాలు ట్రై చెయ్యండి
మధుమేహం వచ్చిందంటే నోటికి తాళం పడినట్లే. ఏది తినాలన్నా కూడా చాలా భయపడతారు. శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవచ్చు.
మధుమేహం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి వచ్చిందంటే దాని ఫలితం జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే అది శరీర సాధారణ పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది. మధుమేహం వల్ల శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి అవదు. అందుకే సప్లిమెంట్స్, ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. డయాబెటిస్ కి సరైన చికిత్స తీసుకోకపోతే నరాలు, కళ్ళు, మూత్రపిండాలతో పాటు ఇతర అవయవాలని దెబ్బతీస్తుంది. ఆయుర్వేద చిట్కాలు పాటించి మధుమేహం అదుపులో ఉంచుకోవచ్చు. అందుకోసం ఆహారం తీసుకునే విషయంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది.
మధుమేహం రావడానికి కారణాలు
జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఔషధాలు అతిగా వినియోగించడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
మధుమేహం లక్షణాలు
☀ ఆకలి పెరగడం
☀విపరీతమైన దాహం
☀అకస్మాత్తుగా బరువు తగ్గడం
☀తరచూ మూత్ర విసర్జన
☀కంటి చూపు మసకబారడం
☀అలసట
☀గాయాలు నయం కాకుండా తీవ్రమవడం
రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించేందుకు సహాయపడే వివిధ సులభమైన సహజ మార్గాలు ఉన్నాయి. వాటిలో ఆయుర్వేదం ఒకటి. ఈ ఆయుర్వేద పద్ధతుల ద్వారా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. సులభంగా మీ వంటింట్లో దొరికే వాటితోనే అది సాధ్యం అవుతుంది.
త్రిఫల చూర్ణం
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి త్రిఫల చూర్ణం ఉత్తమమైన మార్గాలలో ఒకటి. ఇది మూడు శక్తివంతమైన మూలికల మిశ్రమాలతో తయారు చేయబడింది. అమలాకి, హరితకీ, బిభితాకి అనే మూలికలతో ఈ త్రిఫల చూర్ణం చేస్తారు. ఇది తీసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. వివిధ అధ్యయనాల ప్రకారం త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని తగ్గిస్తుంది. గ్లూకోజ్ కొవ్వుగా మారకుండా ఇన్సులిన్ ప్రేరేపిస్తుంది.
వేప
భారత్ లో విస్తృతంగా లభించే మొక్క ఇది. రక్తంలో చక్కెర స్థాయిలని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. వేప ఆకులు, పువ్వులు, గింజలు, పండ్లు, వేర్లు, బెరడు ఇలా అన్ని భాగాలు సంప్రదాయ ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఒక అధ్యయనం ప్రకారం వ్యాధులని నయం చేయడంతో వేప చాలా సహాయకారిగా ఉంటుంది. వేప ఆకుల పొడి మధుమేహ లక్షణాలని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
ఉసిరి
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఉసిరిలో క్రోమియం ఉంది. కార్బోహైడ్రేట్ జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరంలో ఇన్సులిన్‌కు మరింత ప్రతిస్పందించేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
కాకరకాయ
చేదుగా ఉన్నప్పటికీ కాకరకాయ తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడానికి ఆయుర్వేదంలో ఉత్తమమైన పదార్థం ఇది. దీనితో చేసిన జ్యూస్ టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రోగులకి చాలా మేలు చేకూరుస్తుంది. ఉదయాన్నే దీన్ని తీసుకోవచ్చు. ఇన్సులిన్ పెంచేందుకు దోహదపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: టైఫాయిడ్ జ్వరం ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి? రక్షణ పొందడం ఎలా?