Avoid Eating these: ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే వీటిని తగ్గించండి...
మన ఆరోగ్యాన్ని, మెరుగైన జీవితకాలాన్ని నిర్ణయించేది మనం తినే ఆహారమే.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమని ఆరోగ్యనిపుణులు సూచిస్తుంటారు. అసలు ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి? శరీరానికి సరైన పోషకాలన్నీ అందే విధంగా, పోషక విలువలు ఉన్న పదార్థాలను ఎంపిక చేసుకోవడం. మీ ఆరోగ్యమే మీ ఆయుర్ధాయాన్ని నిర్ణయిస్తుంది. ఎక్కువ కాలం ఆనందంగా బతకాలంటే మంచి ఫుడ్ ను తింటూ చురుకుగా ఉండాలి. రోగాల బారిన పడకుండా జాగ్రత్తపడాలి. అయితే కొన్ని రకాల పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చేటు కలగొచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టాలంటే కొన్ని పోషకాలను మితంగా తీసుకోవాలి.
ట్రాన్స్ ఫ్యాట్
ఇది అత్యంత అనారోగ్యకరమైన ఆహారపు కొవ్వు. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను తగ్గించి, చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉండే పదార్థాలను తినడం వల్ల గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఇది టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ధమనులలో కొలెస్ట్రాల్ పెరగేలా చేస్తుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ పిజ్జాలు, ఫ్రిజ్ లో పెట్టిన చపాతి, బిస్కెట్లు చేసే పిండి, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, డోనట్స్, మైక్రోవేవ్లో చేసిన పాప్ కార్న్, కేకులు, కుకీలు వంటివి అధికంగా తింటే ట్రాన్స్ ఫ్యాట్ ఒంట్లో చేరే అవకాశం ఉంది. e
సోడియం
సోడియం శరీరానికి అవసరమే. కానీ అధికమైతే మాత్రం అనర్థమే. నిపుణులు చెప్పిన దాని ప్రకారం, సోడియం అధికంగా ఒంట్లో చేరితే రకరకాల రోగాలు దాడి చేస్తాయి. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రావచ్చు. అలాగే ఎముకలు కూడా బలహీనపడతాయి. ప్యాక్ చేసిన ఆహారంలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది.
చక్కెర
తీపి పదార్థాలు ఎవరికీ మాత్రం నచ్చవు. అయితే వీటిని అధికంగా తినడం వల్ల మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్టే. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్పిన దాని ప్రకారం... చక్కెర పానీయాలు మన శరీరానికి కావాల్సిన దాని కన్నా 47 శాతం ఎక్కువ చక్కెరను కలిగి ఉంటాయని చెప్పింది. అధిక చక్కెర ఒంట్లో చేరడం వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, మంట, కాలేయంలో కొవ్వు చేరడం వంటి సమస్యలకు దారి తీయచ్చు. ఇవన్నీ కూడా గుండె జబ్బులు మరియు పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతుంది.
నైట్రేట్లు
ఇవి రసాయన సమ్మేళనాలు అయినప్పటికీ, అవి కూడా ఓ రకంగా పోషకాలుగానే పరిగణిస్తారు. నైట్రేట్లు అధికంగా ఒంట్లో చేరితే గుండె వేగంగా కొట్టుకోవడం, వికారంగా అనిపించడం, తలనొప్పి, కడుపు నొప్పి వంటి వాటికి కారణం కావచ్చు. అంతేకాదు నైట్రేట్లు మరీ ఎక్కువైతే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నైట్రేట్లు పాలకూర, ముల్లంగి, సోంపు, క్యాబేజీ, పార్ల్సీ, దాదాపు అన్ని రకాల పండ్లలోనూ ఇవి లభిస్తాయి. వీటిని అధికమొత్తంలో కాకుండా మిగతా అన్ని పదార్థాలతో కలిపి తింటే నైట్రైట్లు సమపాళ్లలోనే అందుతాయి.
ఇనుము
శరీరానికి ఐరన్ చాలా అవసరం. కానీ అధికంగా అందితే మాత్రం చాలా అనర్థం. ఐరన్ అధికంగా ఒంట్లో చేరితే కణజాలం, అవయవాలలో పేరుకుపోతుంది. దీనివల్ల హిమోక్రోమాటోసిస్ వంశపారపర్య రోగం కలుగవచ్చు. ఈ వ్యాధికి చికిత్స చేయకుండా వదిలేస్తే ఆర్ధరైటిస్, కాలేయసమస్యలు, మధుమేహం, గుండె, క్యాన్సర్ రోగాలు కలిగే అవకాశం ఉంది. కనుక ఐరన్ మీ శరీరానికి సరిపడా తీసుకోండి. ఇనుము ఉన్న పదార్థాలను రోజులో అధికమొత్తంలో తీసుకోవడం మానండి.