Peanuts: అతిగా వేరుశెనగ తింటున్నారా? తీవ్రమైన ఈ దుష్ప్రభావాలు తప్పవు
రుచిగా ఉంటున్నాయ్ కదా అని వేరుశెనగ అతిగా తింటున్నారా? అయితే అనేక అనారోగ్య సమస్యలని ఆహ్వానించినట్టే అవుతుంది.
పప్పు ధాన్యాలకి చెందిన వేరుశెనగ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రుచికరమైన స్నాక్స్ గా ఇది ఎప్పుడు మనకి అందుబాటులో ఉండే చక్కని పదార్థం. చిన్న పిల్లలు కూడా దీనితో చేసిన స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు. అనేక ఖనిజాలు, పోషకాల మూలం వేరుశెనగ. దీనితో చట్నీ చేసుకుని తిననిదే కొంతమందికి అల్ఫాహారం పూర్తి కాదు. మాంగనీస్, నియాసిన్ సమృద్ధిగా ఉండే వేరుశెనగలో విటమిన్స్ ఇ, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఫిట్ గా ఉంచడంలో సహాయపడతాయి.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, బరువును అదుపులో ఉంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తుంది. జీవక్రియ రేటు పెరిగేందుకు సహాయపడుతుంది. ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది కదా అని అతిగా తినకూడదు. ఏదైనా ఆహారం మితంగా తింటే ఆరోగ్యం అమితంగా తింటే అనారోగ్యమే. ఇది వేరుశెనగ విషయంలో కూడా వర్తిస్తుంది. అతిగా వీటిని తినడం వల్ల కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. వేరుశెనగ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు, కొవ్వు పదార్థాలు, టాక్సిన్స్, యాంటీ న్యూట్రియంట్స్ వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేరుశెనగలో ఉండే యాంటీ న్యూట్రిషియన్స్ శరీరంలోని పోషకాల శోషణ నిలిపివేసి, మనం తీసుకునే ఆహారంలోని పోషక విలువలని తగ్గిస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అతిగా తినడం వల్ల అనార్థాలు
బరువు పెరగడం: వేరుశెనగలో కేలరీలు చాలా ఎక్కువ. అధికంగా తీసుకుంటే బరువు పెరగడానికి దోహదపడుతుంది. ఒక ఔన్స్ వేయించిన వేరుశెనగలో 170 కేలరీలు ఉంటాయి. వీటిని అల్పాహారంగా తీసుకునేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఔన్సులు తింటే కేలరీలు ఎక్కువ తీసుకుంటున్నట్టే. అంటే బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
అలర్జీలు: చాలా మందికి వేరుశెనగ అంటే అలర్జీ ఉంటుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతక ప్రతిస్పందన కలిగిస్తుంది. వేరుశెనగ అలర్జీ సంకేతాలు
⦿ ముక్కు కారడం
⦿ దురద
⦿ దద్దుర్లు
⦿ చర్మం ఎర్రగా మారి వాపు రావడం
⦿ నోరు, గొంతులో ఇబ్బంది
⦿ అతిసారం, వాంతులు
⦿ వికారం వంటి జీర్ణ సమస్యలు
⦿ ఊపిరి ఆడకపోవడం
⦿ రక్తపోటు తగ్గడం
⦿ మైకం
సోడియం అధికం: వేరుశెనగలో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటుని ప్రభావితం చేస్తుంది. కండరాల సంకోచాలకు సోడియం అవసరం అవుతుంది. అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఎక్కువ సోడియం నీటిని రక్తనాళాలలోకి తీసుకుంటుంది. దీని వల్ల గుండెపై అదనపు భారం పడుతుంది.
కలుషితం కారణం: వేరుశెనగలో అఫ్లాటాక్సిన్‌లను ఉత్పత్తి చేసే నిర్దిష్ట శిలీంధ్రాలు ఉంటాయి. ఇదొక రకమైన ఫంగస్. వెచ్చని తేమతో కూడిన ప్రాంతాల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. వెచ్చని ప్రదేశాల్లోనే వేరుశెనగ పండించడం జరుగుతుంది. అందువల్ల ఈ ఫంగస్ చాలా త్వరగా వీటికి వ్యాపిస్తుంది. ఈ ఫంగస్ సోకిన వేరుశెనగ తినడం వల్ల క్యాన్సర్ కారక అఫ్లాటాక్సిన్ కి గురవుతారు. ఇవి కాలేయంపై కూడా ప్రభావం చూపిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: స్టెరాయిడ్స్ ఉన్న క్రీములు అతిగా వినియోగిస్తున్నారా? జాగ్రత్త మీ అందం కోల్పోవాల్సి వస్తుందేమో