Breast Cancer: మగవారికీ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? ఈ లక్షణాలు కనిపిస్తే ఏమిటర్థం?
Breast Cancer: రొమ్ము క్యాన్సర్ అనగానే ఆడవారికే వస్తుందనుకుంటారు కానీ, మగవారికి కూడా వస్తుందని చెబుతున్నారు వైద్యులు.
Breast Cancer: రొమ్ము క్యాన్సర్ కేవలం మహిళలకే వస్తుందని అందరి నమ్మకం. 2020లో ప్రపంచ వ్యాప్తంగా 23 లక్షల మంది స్త్రీలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తేలింది. వారిలో 10 లక్షల మందికి పైగా మరణించారు. ప్రపంచంలో అధికంగా ఈ క్యాన్సర్ తోనే బాధపడుతున్నారు స్త్రీలు. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే.. రొమ్ము క్యాన్సర్ మగవారికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.
ఇవే వస్తాయి...
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెప్పిన ప్రకారం, అమెరికాలో బయటపడిన ప్రతి వంద రొమ్ము క్యాన్సర్ కేసుల్లో ఒకటి పురుషుల్లో బయటపడుతోంది. మగవారిలో వస్తున్న సాధారణ క్యాన్సర్లు ఇవే.
ఇన్వాసివ్ డక్టల్ కార్సినోమా: ఈ రకమైన క్యాన్సర్‌లో, రొమ్ము కణజాలంలోని నాళాలు, ఇతర భాగాలలో క్యాన్సర్ కణాలు పెరగడం ప్రారంభమవుతాయి. ఇవి ఇతర ప్రాణాలకూ వ్యాపిస్తాయి.
ఇన్వాసివ్ లోబ్యులర్ కార్సినోమా: ఈ క్యాన్సర్లో రొమ్ములోని లోబుల్స్‌లో కణాలు పెరగడం ప్రారంభమవుతాయి. అక్కడ్నించి రొమ్ము కణజాలం, ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి.
డక్టల్ కార్సినోమా: ఇదొక రొమ్ము వ్యాధి. ఈ వ్యాధి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం.
వీళ్లలోనే...
మగవారిలో అందరిలో రొమ్ము క్యాన్సర్ వస్తుందని చెప్పలేం. అధికంగా 60 ఏళ్లు దాటిన పురుషుల్లోనే రొమ్ములో క్యాన్సర్ కణితులు పెరుగుతాయి. యువకుల్లో వచ్చే ప్రమాదం కాస్త తక్కువనే చెప్పాలి. కానీ కచ్చితంగా రావని కాదు. వారు కూడా ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి.
మగవారిలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు
1. రొమ్ములోపల వాపు కనిపిస్తుంది. నొక్కితే చేతికి గట్టిగా తగులుతుంది. నొప్పి ఉండదు.
2. రొమ్ము ప్రాంతాల్లోని చర్మం పొరలుగా మారుతుంది. దద్దుర్లు కూడా వస్తాయి.
3. రొమ్ము దగ్గరి చర్మం చికాకు పెడుతుంది.
4. చనుమొనల నుంచి స్రావాలు, రక్తం కారడం జరుగుతుంది.
5. చనుమొనల ప్రాంతంలో నొప్పి వస్తుంది.
6. చంకల్లో చిన్న గడ్డలు చేతికి తగులుతాయి.
ఇది వచ్చే ప్రమాదం ఎవరికి ఉంది?
రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే కొన్ని పరిస్థితులు ఉన్నాయి.
వయస్సు
ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం మగవారిలో వయస్సుతో పాటు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు దీనికి గురయ్యే అవకాశం ఉంది.
వారసత్వం
మగవారికి కూడా వారసత్వంగా జన్యువుల ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
రేడియేషన్
ఒక వ్యక్తి ఎప్పుడైనా ఛాతీ ప్రాంతంలో రేడియేషన్ థెరపీ చికిత్స చేయించుకున్నవాడైతే ఆయన జాగ్రత్తగా ఉండాలి. వీరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికం.
హార్మోన్ థెరపీ
చాలా మంది హార్మోన్ థెరపీ చేయించుకుంటారు. వారు వాడిన మందుల్లో ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటే మగవారు రొమ్ము క్యాన్సర్ బారిన పడొచ్చు.
సిర్రోసిస్
కాలేయం సిర్రోసిస్ వ్యాధి ఆండ్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే పురుషులలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగితే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఊబకాయం
సాధారణ బరువు ఉన్న మగవారితో పోలిస్తే ఊబకాయంతో బాధపడే పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
Also read: బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కొన్ని నెలల ముందే కనిపించే ప్రధాన సంకేతం ఇది, తేలికగా తీసుకోవద్దు