Ayurvedam: ఆయుర్వేదం ప్రకారం ఆర్ధరైటిస్ నొప్పిని తగ్గించే పదార్థాలు ఇవే
ఆర్ధరైటిస్ నొప్పి చాలా మందిని వేధిస్తుంది. దాన్నుంచి ఎలా బయటపడాలో ఆయుర్వేదం చెబుతోంది.
ప్రాచీన కాలం నుంచి ఉన్న వైద్య పద్ధతుల్లో ఆయుర్వేదం ఒకటి. వైద్యానికి పురాతన రూపం ఇది. అనేక వ్యాధులను, అనారోగ్యాలను నయం చేయగల సామర్థ్యం ఉందని ఆయుర్వేదం ఎప్పుడో నిరూపించుకుంది. కొన్ని రకాల నొప్పులకు ఆయుర్వేదం సూచించిన పద్ధతులు త్వరగా ఉపశమనాన్ని అందిస్తాయి. ముఖ్యంగా దీనికయ్యే ఖర్చు కూడా తక్కువ. ఈ కథనంలో ఆర్ధరైటిస్ నొప్పుల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. రుమటాయిడ్ ఆర్ధరైటిస్ అనేది శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు వాపుకు దారితీసే పరిస్థితి. దీని వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. ఈ వ్యాధిలో రోగనిరోధక వ్యవస్థే తమ సొంత శరీరంపై దాడి చేస్తుంది కాబట్టి దీన్ని ఇమ్యూన్ వ్యాధిగా పరిగణిస్తారు. ఈ నొప్పులు భరించలేక చాలా మంది ఇబ్బంది పడతారు. ఆయుర్వేం ప్రకారం కొన్ని రకాల ఆహారాలను రోజూ తినడం ద్వారా ఆర్ధరైటిస్ నొప్పులను ఎదుర్కోవచ్చు.
అల్లం
ఆర్ధరైటిస్‌తో బాధపడేవారికి అల్లం ఎంతో మేలు చేస్తుందని చెబుతోంది ఆయుర్వేదం. ఇందులో యాంటీ బాక్టిరియల్,యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడే శక్తి శరీరానికి అందుతుంది. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌తో బాధపడే వ్యక్తులు వారి రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవాలి. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం పచ్చడి చేసుకోవడం, కూరల్లో అల్లం నూరి కలుపుకోవడం వంటివి చేసి అల్లాన్ని ఆహారంలో ప్రధాన భాగంగా మార్చుకోవాలి.
వెల్లుల్లి
అల్లం జోడీ వెల్లుల్లి. ఇది కూడా రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌కు ఔషధంలా పనిచేస్తుంది. ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాపు, నొప్పి వంటివి తగ్గుతాయి. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్‌తో పోరాడే శక్తి వెల్లుల్లికి వస్తుంది.
మెంతులు
మెంతులు మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి. అంతే మేలు ఆర్ధరైటిస్‌తో బాధపడేవారికి చేస్తాయి. రాత్రంతా మెంతులను నీళ్లలో నానబెట్టి, ఉదయం లేచ్చాక ఆ విత్తనాలను తినేయాలి.లేదా మెంతి పొడి చేసుకుని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం లేచాక ఆ నీటిని తాగేయాలి. ఇది కీళ్లనొప్పులను, వాపును కూడా తగ్గిస్తుంది.
పసుపు
పసుపులో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనారోగ్యాలను నయం చేసే సామర్థ్యం ఇందులో ఉంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. పసుపును ఆహారంలో కలుపుకుని తినడం వల్ల కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. కూరల్లో, అన్నంలో పసుపు కలుపుకుని తినడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
Also read: దోసకాయ తింటే మంచిదే, కానీ ఇలా మాత్రం తినకూడదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.