ఐడియా అదుర్స్, ఏ పని చేయకుండా గంటకు రూ.5 వేలు సంపాదిస్తున్న యువకుడు, ఎలాగంటే..
ఒంటరిగా ఉన్నవాళ్లు బయటకు వెళ్లాలంటే జపాన్ లో ఓ వ్యక్తి తోడుగా వస్తాడు. కానీ, అతడు గంటకు ఇంత అని ఛార్జ్ చేస్తాడు.
ఏ తోడు లేకుండా.. ఒంటరిగా జీవించడమంటే చాలా కష్టం. యుక్త వయస్సులో ఎవరో ఒకరు తోడుగా ఉంటారు. కానీ, పెద్ద వయస్సు వచ్చాక.. ఒంటరి జీవితానికి అలవాటు పడాల్సి వస్తుంది. అయినవారిని కోల్పోయి లేదా ఏదో ఒక కారణం వల్ల దూరమై కొందరు ఒంటరిగా జీవిస్తుంటారు. అలాంటివారికి ‘‘నేను తోడుగా ఉంటా’’ అంటూ ముందుకొస్తున్నాడు 38 ఏళ్ల వ్యక్తి. అయితే, అతడు ఊరికే తోడు రాడు. మీరు అతడు అడిగిన మొత్తాన్ని చెల్లిస్తేనే తోడుంటాడు. పైగా మీరు అతడి ఎలాంటి పని చెప్పకూడదు.
గంటకు రూ.5,600 ఛార్జ్
డబ్బులు తీసుకొని తోడుగా వచ్చే అతడి పేరు షోజీ మోరిమోటో. ఉండేది జపాన్ రాజధాని టోక్యోలో. లాంకీ బిల్డ్, యావరేజ్ లుక్‌తో ఉండే మోరిమోటో ఇప్పుడు ట్విట్టర్‌లో దాదాపు పావు మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. గతంలో తను ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కానీ, తనకు ఆ ఉద్యోగం చేయడం నచ్చలేదు. కష్టంతో కూడిన పని చేయాలి అనిపించలేదు. అందుకే కష్టపడకుండా డబ్బులు సంపాదిండం ఎలా అని ఆలోచించడం మొదలు పెట్టాడు. చివరకు ఓ ఐడియా వచ్చింది. ఒంటరిగా ఉండే వారికి తోడుగా ఉండాలని భావించాడు. ఇదే విషయాన్ని తన మిత్రులకు చెప్పారు. నెమ్మదిగా అతడి గురించి జనాలకు తెలిసిపోయింది. ఒంటరిగా ఉండే వాళ్లు సరదాగా బయటకు వెళ్లేందుకు అతడిని తోడు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. వారితో గడిపేందుకు మోరిమోటో గంటకు 10,000 యెన్‌లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.5,600 వసూలు చేస్తున్నాడు.
ఇప్పటి వరకు 4 వేల మందితో
“నన్ను చాలా మంది అద్దెకు తీసుకుంటారు. నా క్లయింట్స్ వారితో పాటు గడిపేందుకు తీసుకెళ్తారు. జస్ట్ నేను వారితో వెళ్తాను. వారు నాకు ఏ పని చెప్పకూడదనేని రూల్. గత నాలుగు సంవత్సరాలలో అతడు దాదాపు 4,000 మందికి తోడుగా వెళ్లాడు. వారిలో నాలుగింట ఒక వంతు మంది రిపీట్ క్లయింట్స్” అని మోరిమోటో వెల్లడించాడు.
కేవలం జపాన్ లోనే
మోరిమోటో కేవలం జపాన్ లోని క్లయింట్స్ వెంటే వెళ్తాడు. ఇతర దేశాల నుంచి ఆఫర్లు వచ్చినా తను వాటిని తిరస్కరించాడు. లైంగిక స్వభావం కలిగిన ఎలాంటి రిక్వెస్ట్ ను తను యాక్సెప్ట్ చేయడు. తాజాగా 27 ఏళ్ల డేటా అనలిస్ట్ అరుణా చిడా చీర కట్టుకుని మోరిమోటోతో బయటకు వచ్చింది. రెస్టారెంట్ లో కూర్చుని తనతో టీ తాగడంతో పాటు కేక్ ల గురించి మాట్లాడింది. అరుణా చిడాకు చీర కట్టుకుని టోక్యో వీధుల్లో తిరగాలని ఉండేది. కానీ, తన మిత్రులు ఇబ్బంది పడతారని భావించిన అద్దె వ్యక్తితో బయటకు వచ్చింది. తనకు నచ్చిన చీర ధరించి వీధుల్లో సరదాగా గడిపింది.
ఇతరులతో బయటకు వెళ్లడమే మోరిమోటో ఏకైక ఆదాయ వనరు. ఇలా సంపాదించిన డబ్బుతో అతడు తన భార్య , బిడ్డకు పోషించుకుంటున్నాడు. ఇలా చేయడం వల్ల అతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పలేదు. కానీ.. రోజుకు ఒకరు, లేదంటే ఇద్దరితో బయటకు వెళ్తానని చెప్పాడు. కరోనాకు ముందు రోజుకు ముగ్గురు లేదంటే నలుగురితో బయటకు వెళ్లేవాడినని చెప్పాడు.
Also Read: గజినీలకు గుడ్ న్యూస్, ఆ క్యాప్ పెట్టుకుంటే మతిమరుపు పోతుందట!
Also Read: పోషకాల పవర్ హౌస్ కివీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు