Group-1 Answer Key: 'గ్రూప్-1' ప్రిలిమినరీ కీ వచ్చేసింది, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో! అభ్యంతరాలకు అవకాశం!!
గ్రూప్ 1 ప్రిలిమినరీ ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలిపేందుకు టీెఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలున్నవారు అక్టోబరు 31 నుంచి నవంబరు 4న వరకు అభ్యంతరాలకు తెలపవచ్చు.
తెలంగాణ రాష్ట్ర తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ శనివారం (అక్టోబరు 29) విడుదలైంది. ప్రిలిమ్స్ పరీక్షలో వివిధ సిరీస్‌లలో ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా జంబ్లింగ్ చేసి బహుళ సిరీస్‌ల్లో ప్రశ్నపత్రాలను రూపొందించారు. వాటన్నింటికీ మాస్టర్‌గా ఉన్న ప్రశ్నపత్రాన్ని, దాని ప్రాథమిక ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపేందుకు 5 రోజులపాటు అవకాశం కల్పించారు.
ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (OMR డిజిటల్ కాపీలను) కూడా అధికారిక టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిటల్ ఓఎంఆర్ పత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డిజిటల్ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 29 వరకు అభ్యర్థుల OMR పత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. గడువు అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఎంఆర్ డిజిటల్ పత్రాలు పొందే అవకాశం లేదని కమిషన్ స్పష్టం చేసింది.
Group 1 - Preliminary Key (MASTER QUESTION PAPER)
Group 1 - Prelims Question Paper (Telugu/ English) Version
Group 1 - Prelims Question Paper (Urdu/ English) Version
అభ్యంతరాలకు అవకాశం..
ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలిపేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలున్నవారు అక్టోబరు 31 నుంచి నవంబరు 4న సాయంత్రం 5 గంటల వరకు తమ అభ్యంతరాలకు తెలపవచ్చు. ఇందుకోసం ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాకుంటే రెండు, మూడు రోజుల్లో ఫైనల్ కీ ని ప్రకటించనుంది. ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా టీఎస్‌పీఎస్సీ విడుదల చేయనుంది. మొత్తం 503 పోస్టుల్లో ఒక్కో ఉద్యోగానికి 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. అంటే మొత్తం 25,150 మంది గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 16న 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,86,051 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో టీఎస్‌పీఎస్సీ తొలిసారి ఒక్కో అభ్యర్థికి ఒక్కో నంబర్ సిరీస్‌తో ప్రశ్నాపత్రం ఇచ్చింది. ప్రశ్నలు అవే ఉన్నప్పటికీ జంబ్లింగ్ పద్ధతిలో జవాబులు అడిగారు. ప్రతిఒక్కరికీ ఒక్కో ‘కీ’ ఇవ్వడం సాధ్యం కానందున మాస్టర్ క్వశ్చన్ పేపర్ ‘కీ’ విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా.. అభ్యర్థుల జవాబు పత్రాలన్నీ జిల్లాల నుంచి అక్టోబు 17న హైదరాబాద్‌కు చేరుకున్నాయి. అక్టోబరు 18 నుంచి అభ్యర్థుల OMR పత్రాల ఇమేజ్ స్కానింగ్ ప్రారంభమైంది. కమిషన్ ముందుగా ప్రకటించినట్లుగా 8 పనిదినాల్లో ప్రక్రియ పూర్తయింది. అయితే ఇందులో పండగ సెలవుల్ని మినహాయించారు. దీంతో అక్టోబరు 29న ప్రాథమిక ఆన్సర్ కీని కమిషన్ విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి గడువులోగా అభ్యంతరాలు స్వీకరించి, తర్వాత ఫలితాలతోపాటు తుది ఆన్సర్ 'కీ'ని కమిషన్ విడుదల చేయనుంది.
కటాఫ్ మార్కులు లేవు..
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్ మార్కులపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై టీఎస్‌పీఎస్సీ అధికారులు అక్టోబరు 17న స్పష్టత ఇచ్చారు. 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమేనని, ఇందులో ఎలాంటి కనీస అర్హత మార్కులు ఉండవని ప్రకటించింది. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్పులు జరిగాయని వివరించింది. గతంలో మార్కుల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం ఉండేదని పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. మల్టీ జోన్ వారీగా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.