TGGENCO Results: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాల విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
TGGENCO: జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్, కెమిస్ట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీని సంస్థ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
TGGENCO RESULT: తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(జెన్‌కో)లో అసిస్టెంట్ ఇంజినీర్ (AE), కెమిస్ట్ (Chemist) పోస్టుల భర్తీకి జులై 14న నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జెన్‌కో అధికారులు ఆగస్టు 30న ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ, మొబైల్ నెంబరు వివరాలు నమోదుచుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు పరీక్షల తుది ఆన్సర్ కీని కూడా జెన్‌కో విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కీ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఫైనల్ కీని ప్రకటించారు. అభ్యర్థులకు తర్వాతి దశలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
జెన్‌కో రాతపరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (AE), కెమిస్ట్ (Chemist) పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 5న నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 399 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇందులో 339 ఏఈ పోస్టులు, 60 కెమిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 31న రాతపరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో పరీక్ష వాయిదాపడింది. దీంతో జులై 14న రాతపరీక్ష నిర్వహించారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించించారు. తాజాగా తుది కీతోపాటు ఫలితాలను విడుదల చేశారు.
జెన్‌కోలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో విధిగా 5 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి సర్వీస్ బాండ్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో ఏడాదికాలం శిక్షణ ఉంటుంది. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ కాలంలో ఉద్యోగం మానేస్తే.. నష్టపరిహారం కింద అభ్యర్థుల నుంచి రూ.50,000 వసూలు చేస్తారు. ఇక ప్రొబేషన్ పీరియడ్ తర్వాత ఉద్యోగం వదిలి వెళితే.. రూ.1లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
➥ ఏఈ పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 339 (లిమిటెడ్-94, జనరల్-245)
విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-187, మెకానికల్-77, ఎలక్ట్రానిక్స్-25, సివిల్-50.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
➥ కెమిస్ట్ పోస్టుల వివరాలు
ఖాళీల సంఖ్య: 60 (లిమిటెడ్-03, జనరల్-57)
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షలో రెండు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 'సెక్షన్-ఎ'లో అభ్యర్థుల సబ్జెక్టు (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు-80 మార్కులు, 'సెక్షన్-బి'లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు).