RTC Jobs: ఆర్టీసీలో త్వరలో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ, డ్రైవర్ పోస్టులే అధికం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)లో మూడు వేల పైచిలుకు (3,035) పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
TSRTC Recruitment: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)లో మూడు వేల పైచిలుకు (3,035) పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. సంస్థలో కారుణ్య నియామకాలు మినహా గత పదేళ్లుగా పోస్టుల భర్తీ లేకపోవడం, ఏటా పదవీ విరమణలతో ఖాళీలు పెరుగుతుండడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. దీంతో తక్షణమే నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారని, గత పదేళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు లేవని, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పరచుకొని కొత్త నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని, జనవరి 31న ఉద్యోగాల భర్తీకి సంబంధించి శుభవార్త వస్తుందని గతంలో మంత్రి పొన్నం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రెండు నెలల తర్వాత తాజాగా నియామకాల ప్రక్రియకు సంబంధించి కసరత్తు మొదలైంది. రాష్ట్రంలో కొత్తగా 1325 డీజిల్, 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి రాబోతున్నాయి. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. వీటితో పాటు ఇంకొన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది.
మహాలక్ష్మితో మరింత ఒత్తిడి..
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో 65 శాతం నుంచి 100 శాతానికి చేరింది. ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు పెరిగింది. దీంతో సిబ్బంది అదనంగా మరికొన్ని గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలో మూడు వేల పోస్టుల భర్తీ దస్త్రాన్ని పరిశీలిస్తున్నామని, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
అదనపు భారం 100 కోట్లు..
ఈ పోస్టుల భర్తీతో సంస్థపై వేతనాల రూపంలో ప్రతి నెల రూ.8.40 కోట్లు, ఏడాదికి రూ.100.80 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సంస్థ లెక్కకట్టింది. ఆర్టీసీ ప్రతిపాదనల్లో మూడింట రెండొంతులు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. దీంతో అత్యధికంగా కొత్త డ్రైవర్లకు వేతనాల కింద ఏడాదికి రూ.65.28 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. సిబ్బంది సర్వీసులో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఆర్టీసీ ఉద్యోగాలు ఇస్తోంది. ఈ విభాగంలో దాదాపు 800 మందిని కండక్టర్లుగా తీసుకునే ప్రక్రియ నడుస్తోంది. ఈ కారణంతో తాజా ప్రతిపాదనల్లో కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదించలేదని సమాచారం.
డ్రైవర్ పోస్టులే అధికం..
ఆర్టీసీలో ప్రస్తుతం 42 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో డ్రైవర్లు 14,747 మంది కాగా, కండక్టర్లు 17,410 మంది. సంస్థలోని అద్దె బస్సుల్లో ఆర్టీసీ నుంచి కండక్టర్ మాత్రమే ఉంటారు. ఆ బస్సుల్ని అద్దెకిచ్చే యజమాని నుంచే ప్రైవేట్ డ్రైవర్ ఉంటారు. ఆర్టీసీ ఇటీవల తీసుకుంటున్న ఎలక్ట్రిక్ బస్సులు కూడా అద్దెవే.
ఖాళీల వివరాలు ఇలా..
పోస్టులు | ఖాళీల సంఖ్య |
డ్రైవర్ | 2000 |
శ్రామిక్ | 743 |
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) | 114 |
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) | 84 |
డీఎం/ఏటీఎం/మెకానికల్ ఇంజినీర్ | 40 |
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) | 23 |
మెడికల్ ఆఫీసర్ | 14 |
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) | 11 |
అకౌంట్స్ ఆఫీసర్ | 06 |
మొత్తం | 3,035 |