TS DSC: డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు - షెడ్యూలు, సిలబస్ ప్రకటించిన విద్యాశాఖ
డీఎస్సీ పరీక్ష తేదీలు, సిలబస్, అర్హతలను విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఆన్‌లైన్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ.. సెప్టెంబరు 20న అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే డీఎస్సీ పరీక్ష తేదీలు, సిలబస్, అర్హతలను విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఆన్‌లైన్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ.. సెప్టెంబరు 20న అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు సబ్జెక్టుల వారీగా డీఎస్సీ పరీక్షల తేదీలను విద్యాశాఖ ఖరారు చేసింది. ప్రతీ రోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి 11.30 వరకు మొదటి విడత, రెండో విడతలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏ తేదీలో ఏ పరీక్ష?
➥ నవంబర్ 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు.
➥ నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్ లాంగ్వెజ్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి.
➥ నవంబరు 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల అభ్యర్థులకు నిర్వహిస్తారు. వీరందరికీ మొదటి విడతలోనే పరీక్షలు నిర్వహించి పూర్తి చేయనున్నారు.
➥ నవంబరు 24న లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
➥ నవంబరు 25 నుండి 30 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిని ప్రతీ రోజూ రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
పరీక్ష స్వరూపం ఇలా..
పరీక్షల తేదీలతోపాటు, పరీక్ష స్వరూపాన్ని కూడా విద్యాశాఖ వెల్లడించింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ పరీక్షలకు సంబంధించిన డిటైయిల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్‌ను విడుదల చేసింది. ఏయే సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులు ఉంటాయనే వివరాలను తెలిపింది.
➥ ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 80 మార్కులు, 160 ప్రశ్నలకు గానూ పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులు టెట్‌లో వచ్చిన స్కోర్‌ను వెయిటేజీగా పరిగణిస్తారు.
➥ పీఈటీ, పీఈడీ అభ్యర్థులకు మాత్రం 100 మార్కులు, 200 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉండనుంది.
దరఖాస్తు ప్రారంభం..
తెలంగాణ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 20న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్ 20లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, అక్టోబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించునున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
అర్హతలు, వయోపరిమితి వివరాలు..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్ అసిస్టెంట్ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358, నిజామాబాద్ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
మొత్తం పోస్టుల్లో జనరల్ అభ్యర్థులకు 2491 పోస్టులు కాగా, మహిళా అభ్యర్థులకు మాత్రం 2598 పోస్టులు కేటాయించారు. అంతేకాకుండా జనరల్ కేటగిరీలోనూ మహిళా అభ్యర్థులు పురుష అభ్యర్థులతో సమానంగా పోటీపడే అవకాశం దక్కింది. దీంతో 55 నుంచి 60 శాతం వరకు ఉద్యోగాలు వారి సొంతం కానున్నాయి. మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ (ఏస్‌ఏ) ఖాళీలు 1739, లాంగ్వేజ్ పండిట్ 611, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 164, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) 2575 పోస్టులు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో వివిధ సబ్జెక్టు పోస్టులుంటే, మరికొన్ని జిల్లాల్లోనైతే సున్నా పోస్టులున్నాయి. ఇంకొన్ని జిల్లాలోనైతే సింగిల్ డిజిట్ పోస్టులే ఉన్నాయి. 16 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ గణితం పోస్టులు సున్నా ఉన్నాయి.