Railway Jobs: అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు, పరీక్షల షెడ్యూలు వెల్లడి
రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వయోపరిమితిని పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు వయసును 30 నుంచి 33 సంవత్సరాలకు పెంచింది.
RRB ALP Posts Age Limit: దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్‌పీ) కొలువులకు ఆర్‌ఆర్‌బీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయోపరిమితిని 18-30 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అయితే వయోపరిమితిని మూడేళ్లు పెంచుతున్నట్లు రైల్వేశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఏఎల్‌పీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జులై 1 నాటికి 18-33 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపింది. అయితే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
అసిస్టెంట్ లోక్ పైల్ పోస్టులకు సంబంధించి జనవరి 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ALP Online Application
ఏఎల్‌పీ సీబీటీ-1 పరీక్షలు ఎప్పుడంటే?
అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టుల భర్తీకి సంబంధించింన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 19తో ముగియనుంది. అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఎదురుచూడకుండా త్వరగా దరఖాస్తులు సమర్పించాలని రైల్వే శాఖ సూచించింది.
పరీక్షల షెడ్యూలు ఇలా..
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ నుంచి ఆగస్టు మధ్య సీబీటీ-1 పరీక్షలు నిర్వహించనున్నారు.
* సీబీటీ-1 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు నెలలో సీబీటీ-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
* నవంబరులో ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) పరీక్ష నిర్వహించనున్నారు.
* ఆప్టిట్యూట్ టెస్ట్ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. నవంబరు లేదా డిసెంబరులో ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
* అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు సంబంధించి వచ్చే ఏడాదికి సంబంధించిన 'సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్'ను 2025 జనవరిలో విడుదల చేస్తారు.
టెక్నీషియన్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్..
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఉద్యోగార్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూస్తూ ఉండాలని తెలిపింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత, అర్హులైనవారందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు ముందుంటాయని పేర్కొంది. టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు తదితర వివరాలన్నీ నోటిఫికేషన్ వెల్లడించిన తర్వాత తెలుసుకోవచ్చని సూచించింది.