Microsoft Lays off Employees: వందలాది మందిని ఒకేసారి తొలగించిన సంస్థ, కారణమేంటో తెలుసా?
ఒకేసారి 1800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది.
కంపెనీ అభివృద్ధి కోసమే..ఈ తొలగింపు..
మైక్రోసాఫ్ట్ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచ్‌లలో కలిపి 1800 మంది ఉద్యోగులను తొలగించింది. స్ట్రక్చరల్ అడ్జస్ట్‌మెంట్స్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కొన్ని రోల్స్‌లో నుంచి ఉద్యోగులను తీసేస్తామంటూ జూన్ 30వతేదీనే ప్రకటించింది మైక్రోసాఫ్ట్. వీరి స్థానంలో కొత్త వాళ్లను నియమించుకుంటామని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా వీలైనంత ఎక్కువ మందిని ఎంపిక చేసుకుంటామని స్పష్టం చేసింది. "మేము కొంత మందిని మాత్రమే తొలగించాం. అన్ని సంస్థల్లాగే మేమూ మా బిజినెస్ ఎలా సాగుతోందో అనలైజ్ చేసుకుంటాం. అందుకు తగ్గట్టుగా ఉద్యోగుల సంఖ్యను అడ్జస్ట్ చేస్తాం" అని మైక్రోసాఫ్ట్ సంస్థ చెబుతోంది. సంస్థలో మొత్తం 1.8 లక్షల మంది ఉద్యోగులున్నారని వారిలో 1% మందిని మాత్రమే తొలగించినట్టు గుర్తు చేస్తోంది. కన్సల్టింగ్, కస్టమర్, పార్ట్‌నర్ సొల్యూషన్స్..ఇలా పలు విభాగాల్లోని ఉద్యోగులను తప్పనిసరి పరిస్థితుల్తో తీసేయాల్సి వచ్చిందని చెప్పింది. కంపెనీ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ప్లాన్ రెడీ చేశామని తెలిపింది.
గూగుల్, స్నాప్‌చాట్ కూడా ఇదే బాటలో..
అటు మరో టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇలాంటి వార్తే వినిపించింది. ఇప్పటి నుంచి ఈ ఏడాది పూర్తయ్యేంత వరకూ నియామకాలు క్రమంగా తగ్గిస్తామని ప్రకటించింది. "ముఖ్యమైన రోల్స్"లో తప్ప మిగతా విభాగాల్లో రిక్రూట్‌మెంట్ మందకొడిగానే సాగుతుందని సీఈవో సుందర్ పిచాయ్ గతంలోనే స్పష్టం చేశారు. ఇంజనీరింగ్, టెక్నికల్ విభాగాల్లో ఎక్కువ మందిని తీసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మెటా సంస్థ కూడా ఇదే విధంగా ప్రకటన చేసింది. రెవెన్యూ టార్గెట్‌లు రీచ్ కాని కారణంగా కాస్ట్ కట్టింగ్ చేస్తున్నట్టు, అందుకు ఎంప్లాయిస్‌ను తగ్గించనున్నట్టు తెలిపింది. మెటా సంస్థ ప్రకటించిన వెంటనే గూగుల్ కూడా ఇదే ప్రకటన చేసింది. తరవాత స్నాప్‌చాట్ పేరెంట్ కంపెనీ స్నాప్, హైరింగ్ ప్రాసెస్‌ని కాస్త మందకొడిగానే సాగిస్తామని తెలిపింది. అంతకు ముందు సంవత్సరం టెస్లా సంస్థ కూడా కొందరు ఉద్యోగులను తొలగించింది.
నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఉద్యోగాల కోత..
నెట్‌ఫ్లిక్స్ సంస్థలోనూ ఈ తొలగింపు కొనసాగుతోంది. ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను తొలగించింది ఈ సంస్థ. పేమెంట్ సబ్‌స్క్రైబర్స్‌ని కోల్పోతున్నామని, ఆ మేరకు ఆదాయానికి కోత పడుతోందని అంటోంది నెట్‌ఫ్లిక్స్. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకే ఉద్యోగులను తీసేయాల్సి వస్తోందని వివరిస్తోంది. దశలవారీగా ఈ తొలగింపు ప్రక్రియను చేపడుతోంది. ఖర్చులు తగ్గించుకోవటంలో భాగంగా మరి కొందరినీ తొలగించాలని చూస్తున్నట్టు సమాచారం. ఓ సారి 300 మందిని, మరోసారి 150 మందిని ఇలా...కొద్ది నెలల్లోనే దాదాపు 11 వందల మందిని తొలగించింది. మిగతా సంస్థలూ ఇదే ట్రెండ్ కొనసాగిస్తాయా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.