![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Agniveer Scheme: అవసరమైతే 'అగ్నివీర్' స్కీమ్‌ను మారుస్తాం, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి
Agniveer Scheme: దేశంలో సైనిక నియామకాలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
![Agniveer Scheme: అవసరమైతే 'అగ్నివీర్' స్కీమ్‌ను మారుస్తాం, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి Govt open to change in Agniveer scheme if needed says minister Rajnath Singh Agniveer Scheme: అవసరమైతే 'అగ్నివీర్' స్కీమ్‌ను మారుస్తాం, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/29/49d1faf40085a4aa15a108d4618b31831711703306943522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Agniveer scheme: దేశంలో సైనిక నియామకాలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓవార్త చానెల్ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అగ్నివీర్, అగ్నిపథ్ నియాకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమలవుతున్న ఆ రెండు స్కీమ్‌లలో అవసరమైతే మార్పులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రక్షణ దళాల్లో యువతరం ప్రాధాన్యాన్ని వివరించిన మంత్రి అగ్నివీర్ పథకాన్ని మరోమారు సమర్థించారు.
రక్షణ దళాల్లో యవ్వనం, జవసత్వాలు గల యువత ఉండాలి(సేనా మే యూత్‌ఫుల్‌నెస్ హోనీ చాహియే) అని ఆకాంక్షించారు. దీని పట్ల ప్రస్తుత యువతరం ఉత్సాహంగా ఉందని భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. వీరంతా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారని నమ్ముతున్నామన్నారు. పథకం (అగ్నివీర్)లో భాగంగా వీరి భవిష్యత్తులను సురక్షితంగా ఉంచేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. అగ్నివీరుల భవిష్యత్తు భద్రంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అవసరమైతే మరిన్ని మార్పులు చేసేందుకు కూడా కట్టుబడి ఉన్నామని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
ఇంజిన్ల ఎగుమతిదారుగా భారత్..
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆత్మనిర్భర్ భారత్ పథకం గురించి కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. భారతదేశాన్ని ఇంజిన్‌లకు ఎగుమతి చేసే దేశంగా మార్చాలనుకుంటున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఇందు కోసం 'ఆత్మనిర్భర్ భారత్'కు మరింత ఊతమివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మంత్రి స్పష్టంచేశారు. దీనికి సంబంధించి మన దేశంతో కలిసి పనిచేయడానికి ఏయే దేశాలు సిద్ధంగా ఉన్నాయో అన్వేషించే బాధ్యతను DRDOకి అప్పగించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఆ ఇంజిన్లన్నీ భారతీయుల ద్వారానే తయారుచేయిస్తామని మంత్రి తెలిపారు.
సరిహద్దులు సురక్షితమే..
భారత్‌కు చెందిన భూమిని చైనా ఆక్రమించిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై.. ఆ దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని రాజ్‌నాథ్ స్పష్టతనిచ్చారు. మన సైన్యంపై పూర్తి విశ్వాసం ఉండాలి. మన దేశం, దాని సరిహద్దులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని నేను దేశప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం 2022 జూన్‌లో ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘అగ్నిపథ్’ లేదా ‘అగ్నివీర్’ పథకం ద్వారా సైన్యం, నావికా దళం, వాయు సేనల కోసం నియామకాలు జరుగుతాయి. ఎంపికైనవారు నాలుగేళ్లపాటు కాంట్రాక్టు పద్ధతిలో నియమితులవుతారు. ఈ నాలుగేళ్లలో ఆరు నెలలపాటు శిక్షణ ఉంటుంది. ఈ నాలుగేళ్లు పూర్తయిన తర్వాత సాయుధ దళాల్లో కొనసాగడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయసు గల యువతను ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి నెలవారీగా రూ.30 నుంచి 40 వేల మధ్య వేతనం వస్తుంది. నాలుగేళ్లు పూర్తయ్యాక ఇందులో 25 శాతం అగ్నివీరులు మాత్రమే శాశ్వత సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక అవుతారు.
రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విసుర్లు..
అగ్నివీర్ పథకంలో ఏమైనా లోటుపాట్లుంటే వాటిని సరిదిద్దుతామంటూ రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల గిమ్మిక్కే అని కాంగ్రెస్ అభివర్ణించింది. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే తప్పకుండా ఆ పథకాన్ని సమూలంగా మారుస్తామని పునరుద్ఘాటించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)