Central Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై కేంద్రం కీలక ప్రకటన- మిషన్ మోడ్‌లో భర్తీ!
కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉన్న పోస్టులను సకాలంలో భర్తీ చేయడానికి మిషన్ మోడ్‌లో చర్యలు తీసుకుంటున్నాం" అని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు స్పందించిన కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్.. మార్చి 1, 2021 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్‌కు చెందిన పే రీసెర్చ్ యూనిట్ వార్షిక నివేదిక ప్రకారం.. గతే ఏడాది మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో 40,35,203 మంజూరైన పోస్టులు ఉన్నాయన్నారు.
40.35 లక్షల మంజూరైన ఉద్యోగాల్లో దాదాపు 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని బుధవారం లోక్‌సభకు తెలియజేశారు. మంజూరైన పోస్టుల్లో 30,55,876 మంది ప్రస్తుతం పని చేస్తున్నారన్నారు. "కేంద్ర ప్రభుత్వంలో పోస్టులను క్రియేట్ చేయడం భర్తీ చేయడం సంబంధిత మంత్రిత్వ శాఖ బాధ్యతని ఇది నిరంతర ప్రక్రియ" అని జితేంద్ర సింగ్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో ఖాళీలు, సబార్డినేట్ కార్యాలయాల్లో పదవీ విరమణ, పదోన్నతులు, రాజీనామాలు, మృతులు వంటి వివరాలు సేకరిస్తున్నామన్నారు. "కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉన్న పోస్టులను సకాలంలో భర్తీ చేయడానికి మిషన్ మోడ్‌లో చర్యలు తీసుకుంటున్నాం" అని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందిని మిషన్ మోడ్‌లో రిక్రూట్‌మెంట్ చేయాలని వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలను ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో కోరారని గుర్తు చేశారు.
మరో క్వశ్చన్‌కు మంత్రి సమాధానం చెబుతూ కార్మిక మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ రూపొందించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లెక్కల ప్రకారం వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలలో మొత్తం 30,87,278మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నట్టు తెలిపారు. మార్చి, 2011 నాటికి 3,37,439 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.