AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన- సర్టిఫికెట్స్ అప్‌లోడ్ కావడం లేదని టెన్షన్
AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీకి సంబంధించి సర్టిఫికెట్స్ అప్‌లోడ్‌లో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. టైం దగ్గర పడటంతో టెన్షన్ కూడా వారిలో ఎక్కువైంది.

AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీకి సంబంధించిన ఉద్యోగ నియామక ప్రక్రియలో మరో అడుగు పడింది. గురువారం వెబ్‌సైట్‌లో కాల్‌లెటర్స్ పెట్టారు. అలా వచ్చిన వారంతా తమ సర్టిఫికెట్స్‌ను అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా కొందరు అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకం కోసం నిర్వహించిన మెగా డీఎస్సీ 2025 కాల్‌లెటర్లు వెబ్‌సైట్‌లో పెట్టారు. ఈ ఉదయం నుంచి వాటిని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇలా కాల్ లెటర్స్ వచ్చిన వారందరికీ 29 నుంచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. వారంతా జిల్లాలో సూచించిన కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వెరిఫికేషన్‌కు వెళ్లే ముందు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
డీఎస్సీలో మంచి ర్యాంకు మార్కులు వచ్చి ర్యాంకు వచ్చిన అభ్యర్థులకు అధికారులు కాల్‌లెటర్స్ పంపించారు. వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ అయిన తర్వాత మీరు కాల్‌లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలా కాల్ లెటర్స్ వచ్చిన వారంతా అదే వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని మాత్రమే పిలిచారు.16వేలకుపైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. కాల్ లెటర్స్ అందుకున్న వ్యక్తులంతా సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వారంతా ఒకేసారి అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నించడంతో ఇబ్బంది ఎదురవుతోందని అభ్యర్థులు చెబుతున్నారు. ఇది ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. చాలా ప్రాంతాల్లో సర్వర్ సమస్యతోపాటు ఇంటర్‌నెట్ సమస్య వల్ల కూడా సర్టిఫికెట్స్ అప్‌లోడ్ కాలేదని వివరిస్తున్నారు.





















