(Source: Matrize IANS)
AP DSC 2026: ఏపీలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్
AP DSC 2026: ఆంధ్రప్రదేశ్‌లో మొన్న నిర్వహించిన డీఎస్సీలో ఉద్యోగాలు రాని వారికి నారా లోకేష్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. జనవరిలో నోటిఫికేషన్ వేస్తున్నట్టు ప్రకటించారు.

AP DSC 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన డీఎస్సీ జనవరిలో నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా డీఎస్సీ, టెట్ ఉంటాయని పునరుద్ఘాటించారు.
ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ మరోసారి ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టెట్, డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి సూచించారు.
పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించాను. ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్, 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీకి… pic.twitter.com/hXrrwRL3MG
— Lokesh Nara (@naralokesh) October 9, 2025
కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తామన్నారు లోకేష్. 2026 జనవరిలో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీ నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్యసాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అన్నారు. బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 78మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యాప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికే ఈ ఏడాది ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 20న 16వేలకుపైగా పోస్టులతో తొలి నోటిఫికేషన్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి రోజే డీఎస్సీ నియామక నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి సంతకం చేశారు. కానీ రిజర్వేషన్ల అంశం ఇతర న్యాయ సమస్యలను పరిష్కరించుకొని ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వచ్చింది.
ఏప్రిల్‌లో వచ్చిన నోటిఫికేషన్‌కు జూన్‌లో పరీక్షలు పెట్టారు. నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. అక్కడికి నెల రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేసి నియామక ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అమరావతిలో వేడుకగా కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలను కూడా అందజేేశారు. ఆ టైంలోనే ఏటా డీఎస్సీ ఉంటుందని నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ వేస్తున్నామని మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అన్నట్టుగానే అందుకు తగ్గ కార్యచరణ చేపట్టాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. మొన్న నోటిఫికేషన్‌లో మిగిలిన పోస్టులు, ఇంకా వివిధ పాఠాశాలల్లో ఉన్న ఖాళీల గుర్తించాల్సి ఉంది. ఈసారి భారీ స్థాయిలో పోస్టులు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.





















