
(Source: ECI/ABP News/ABP Majha)
APPSC Group1 Results: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, మెయిన్స్‌కు ఎంతమంది అర్హత సాధించారంటే?
APPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఏప్రిల్ 12న రాత్రి ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.

Group1 Prelims Results ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఏప్రిల్ 12న రాత్రి ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. గ్రూప్-1 పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. గ్రూప్-1 ఫలితాలకు సంబంధించి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాతోపాటు (Selection List) వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురైన అభ్యర్థుల జాబితాను (Rejection List) కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలతోపాటు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి పేపర్-1, పేపర్-2 తుది ఆన్సర్ కీలకు ఏపీపీఎస్సీ విడుదల చేసింది. పరీక్ష నిర్వహించిన 27 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.
Provisionally qualified candidates list for mains examination
Final Key:
ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో మొత్తం 1,26,068 (84.67 %) మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 %) మంది, పేపర్-2 పరీక్షకు 90,777 (72 %) మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే మెయిన్ పరీక్షకు పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల పరిధిలో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించారు. పరీక్ష ప్రాథమిక కీని మార్చి 19న విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఏప్రిల్ 12న ఫైనల్ ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష విధానం..
మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు కూడా ఉంటాయి. అయితే ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం 825 మార్కులకు అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
