Amazon Jobs: అమెజాన్ జాబ్ మేళా.. 8 వేల ఉద్యోగాలు భర్తీ.. హైదరాబాద్‌లో కూడా..
ఇండియాలోని 35 నగరాల్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. భారతదేశంలో ఈ నెల 16న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియాలో 8 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 55 వేల మందిని నియమించుకోనున్నట్లు పేర్కొంది. అమెజాన్ భారతదేశంలో ఈ నెల 16న తొలి జాబ్ మేళాను నిర్వహించనుంది. ఆన్‌లైన్ విధానంలో ఈ జాబ్ మేళా జరగనుంది.
ఇండియాలోని 35 నగరాల్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ నగరాల్లో హైదరాబాద్, చెన్నై, ముంబై, గుర్ గావ్, కోల్‌కతా, నోయిడా, అహ్మదాబాద్, అమృత్‌సర్, భోపాల్, కోయంబత్తూర్, జైపూర్, కాన్పూర్, లుధియానా, పూణే, సూరత్ ఉన్నాయి. కార్పొరేట్ ఆఫీస్, టెక్నాలజీ, ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్ సహా పలు విభాగాల్లోని ఖాళీలను కంపెనీ భర్తీ చేయనుంది. ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు.. ఇందులో రిజిస్టర్ అయ్యేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.
అమెజాన్ సీఈఓ ఆండీ జాసీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్యోగాల భర్తీ గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఇప్పటికే 10 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్ష పద్ధతిలో ఉపాది కల్పించామని చెప్పారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ తమ సంస్థ 3 లక్షల మందికి ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు. కంటెంట్ క్రియేషన్, రిటైల్, లాజిస్టిక్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అమెజాన్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ సైతం ధ్రువీకరించారు. ప్రతిభ కలిగిన వారితో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా 55 వేల ఉద్యోగాలు..
ఇండియాతో పాటు జపాన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, కెనడాలలోనూ మొట్టమొదటి సారిగా నియమకాలు చేపట్టనున్నట్లు ఆండీ వెల్లడించారు. అమెరికాతో పాటు మిగతా దేశాల్లోని వారికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 55 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటితో 40 వేల జాబ్స్ అమెరికాలో ఉంటాయని చెప్పారు.
Also Read: APEPDCL Recruitment 2021: ఇంటర్, ఐటీఐ చేసిన వారికి గుడ్‌న్యూస్.. ఏపీ విద్యుత్ సంస్థలో 398 జాబ్స్..
Also Read: SBI Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఇవాల్టితో ముగియనున్న దరఖాస్తు గడువు..