Corona: కరోనా థర్డ్ వేవ్ వచ్చిందా? ఇదే ఇండికేషన్!
దేశంలో కరోనా వైరస్ 'ఆర్' ఫ్యాక్టర్ పెరుగుతుందని చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ (ఐఎమ్ ఎస్ సీ)కి చెందిన పరిశోధకులు తెలిపారు. దీని వల్ల థర్డ్ వేవ్ ఉద్ధృతి పెరుగుతుందని హెచ్చరించారు.
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాన్ని ముడో వేవ్ భయపెడుతోంది. థర్డ్ వేవ్ వస్తే భయంకర పరిస్థితులు ఎదురవుతాయని ఇప్పటికే పలు సర్వేలు చెప్పాయి. అయితే తాజాగా చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ (ఐఎమ్ ఎస్ సీ)కి చెందిన పరిశోధకులు కీలక విషయాన్ని వెల్లడించారు.
కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా ఆర్ ఫ్యాక్టర్ లేదా రిప్రొడక్షన్ రేట్ పెరుగుతుందని వారి అధ్యయనంలో తేలింది. ఈ విషయంపై రాష్ట్రాలు, యూటీలు దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది. కరోనా నిబంధనలు పాటించకపోతే థర్డ్ మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆర్ ఫ్యాక్టర్?
- ఆర్ ఫ్యాక్టర్ కరోనా వ్యాప్తి వేగాన్ని సూచిస్తోంది. దేశంలో ఈ ఆర్ విలువ ఇటీవల గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు చెబుతున్నారు.
- జూన్ 30న 0.78గా ఉన్న ఈ ఆర్ విలువ జులై మొదటి వారానికి 0.88కి పెరిగింది. దీని కారణంగానే ఇటీవల రోజువారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
- వివిధ రాష్ట్రాలు, యూటీలలో కరోనా ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేస్తుండటం వల్ల ఈ ఆర్ ఫ్యాక్టర్ పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
- 2021 మార్చి 9 నుంచి ఏప్రిల్ మధ్య కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజిలో ఉండే సమయంలో ఈ ఆర్ ఫ్యాక్టర్ 1.37గా ఉండేది. అయితే ఇది ఏప్రిల్ 24 నుంచి మే1 మధ్య 1.18కి తగ్గింది. ఆ తర్వాత ఏప్రిల్ 29 నుంచి మే 7 మధ్య ఈ ఆర్ ఫ్యాక్టర్ 1.10గా ఉంది.
- మే 14 నుంచి మే 30 మధ్య ఈ ఆర్ విలువ.. 0.82కి తగ్గింది. అయితే మే 15 నుంచి జూన్ 26 మధ్య ఇది 0.78కి తగ్గగా.. జూన్ 20 నుంచి జులై 7కు మళ్లీ 0.88కి పెరిగింది.
ప్రస్తుతం ఈ ఆర్ విలువ మీదే కరోనా వ్యాప్తి వేగం ఆధారపడి ఉందని పరిశోధకులు అంటున్నారు. కరోనా ఆర్ ఫ్యాక్టర్ విలువ ఎంత తగ్గితే వైరస్ వ్యాప్తి అంత తగ్తుతున్నట్లు అర్థమని వారు చెబుతున్నారు. కనుక థర్డ్ వేవ్ వ్యాప్తి ఏ మేరకు ఉంటుందనేది ఈ ఆర్ ప్యాక్టర్ సూచిస్తుందన్న మాట.
కనుక కరోనా జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ థర్డ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగించనుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.