(Source: ECI/ABP News/ABP Majha)
ఈ ఆహారాలు మీలో తిండి మీద కోరికలను పెంచేస్తాయి, దీంతో అధిక బరువు తప్పదు
కొన్ని రకాల ఆహారాలు చూడగానే నోరూరిస్తాయి. అంతేకాదు ఆకలిని పెంచేసి అధిక బరువు బారిన పడేలా చేస్తాయి.
బరువు పెరగడం మంచిది కాదని, అది ఎన్నో అనారోగ్యాలకు సంకేతం అని వైద్యులు చెబుతూనే ఉన్నారు. అధిక బరువు వల్ల అనేక వ్యాధులు త్వరగా శరీరంపై దాడి చేస్తాయి. కాబట్టి సన్నగా, మెరుపుతీగలా ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే కొన్ని రకాల పదార్ధాలు తినడం వల్ల ఆకలి పెరిగిపోతుంది. ఏదైనా తినాలన్నా కోరికను పెంచేస్తాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ ఆహారాలు హైపోథాలమస్‌ను ప్రేరేపిస్తాయి. హైపోథాలమస్ అనేది మెదడులోని ముఖ్యమైన భాగం. ఇలా హైపోథాలమస్‌ను ప్రేరేపించి అధికంగా ఆహారం తినేలా చేసే కొన్ని పదార్థాలు ఇవే. వీటికి దూరంగా ఉంటే... ఆహారం అతిగా తినే ప్రమాదం తగ్గుతుంది.
వైట్ పాస్తా
సులువుగా రెడీ అయిపోయే బ్రేక్ ఫాస్ట్‌లలో వైట్ పాస్తా ఒకటి. బ్రెడ్డు, పాస్తా, నూడుల్స్ వంటివి శుద్ధిచేసిన పిండితో తయారుచేస్తారు. సాధారణంగానే వీటిలో కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరాక సులభంగా రక్తంలో విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. తద్వారా వాటి శోషణ కోసం అధికంగా ఇన్సులిన్ విడుదల అయ్యేలా ప్యాంక్రియాస్ ప్రేరేపితం అవుతుంది. దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే త్వరగా బరువు పెరిగిపోతారు.
స్వీట్స్
చాక్లెట్లు, మిఠాయిలు, డిసర్ట్స్ వంటివి తెచ్చే ఆరోగ్య విపత్తులు ఎక్కువ. వీటిలో ప్రిజర్వేటివ్స్,కార్న్ సిరప్ అధికంగా వాడతారు. ఇవన్నీ కూడా శరీరంలో తగినంత స్థాయిలో లెప్టిన్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి. లెప్టిన్ అనేది ఆకలిని అణచివేసే ఒక హార్మోన్. ఎప్పుడైతే దీని ఉత్పత్తి తగ్గిపోతుందో, ఆకలి పెరిగిపోతుంది. కాబట్టి తీయని పదార్థాలు తినడం తగ్గించుకోవాలి.
ఫ్రెంచ్ ఫ్రైస్
ఫ్రెంచ్ ఫ్రైస్ బంగాళదుంపలతో తయారయ్యే టేస్టీ వంటకం ఇది. దీనిలో కేవలం నూనె, ఉప్పు మాత్రమే వాడతారు. కానీ ఉప్పు అధికంగా వాడడం వల్ల ఇవి ఆకలిని పెంచేస్తాయి. ఆకలిని తట్టుకోలేక ఎక్కువగా తినేసే ప్రమాదం ఉంది.
చిప్స్
ప్రపంచంలో జనాదరణ పొందిన ఆహారాల్లో చిప్స్ ఒకటి. చీజ్, వెల్లుల్లి పొడి, బంగాళదుంపలు, ఉల్లిపాయల పొడి ఇలా రకరకాల పదార్థాలు కలిపి చిప్స్‌ను తయారు చేస్తారు. అవి తినడం ప్రారంభిస్తే ఆపడం కష్టం. చిప్స్ తింటున్నప్పుడు శరీరంలో స్వల్పకాలికంగా ఎండార్పిన్లు విడుదలవుతాయి. అందుకే అవి తింటున్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ వాటిని తినడం వల్ల ఆకలి ఎక్కువైపోయి ఇతర పదార్థాలు కూడా అధికంగా తినేసే అవకాశం ఉంది.
ఐస్ క్రీమ్
పిల్లల ఫేవరెట్ ఫుడ్ ఇది. కొవ్వులు, చక్కెర, క్యాలరీలతో నిండి ఉంటుంది. దీన్ని తినడం వల్ల అతిగా తినే ప్రవర్తనను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఐస్ క్రీమ్‌కు దూరంగా ఉండటం మంచిది.
Also read: డ్రై ఫ్రూట్స్‌ను ఇంట్లోనే సులువుగా ఇలా తయారు చేసేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.