Iron Deficiency: శరీరంలో ఐరన్ లోపిస్తే కనిపించే ముఖ్యమైన మూడు లక్షణాలు ఇవే
శరీరానికి ఇనుము అత్యవసరం. అది తగ్గితే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది.
మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎర్ర రక్త కణాలది ముఖ్యమైన పాత్ర. ఎర్ర రక్త కణాలు తగ్గితే రక్త పరిమాణం తగ్గిపోతుంది. దీనివల్లే ఎనీమియా అంటే రక్తహీనత సమస్య వస్తుంది. ఎర్ర రక్త కణాలు పుష్కలంగా ఉండాలి, అంటే శరీరంలో ఐరన్ అధికంగా ఉండాలి. ఇనుము వల్లే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ కణాలు మన ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్‌ను శరీరంలోని ఇతర భాగాలకు తీసుకువెళతాయి. కాబట్టి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం తగినంత ఇనుమును ఆహారం ద్వారా తీసుకోవాలి. శరీరంలో ఐరన్ లోపిస్తే ముఖ్యంగా కనిపించే లక్షణాలు మూడు... ఈ మూడింట్లో ఏది కనిపించినా కూడా మీకు ఇనుము లోపం ఉందేమో అని చెక్ చేయించుకోవాలి.
తీవ్ర అలసట
శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినప్పుడు రక్తహీనత వస్తుంది. శరీర కణజాలాలకు ఆక్సిజన్ తగినంత చేరనప్పుడు ఇది జరుగుతుంది. అప్పుడు శరీరానికి విపరీతమైన అలసటగా అనిపిస్తుంది. బలహీనంగా అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించదు. రోజువారి చేసే పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. నిద్ర సరిగా పట్టదు. చిన్న చిన్న వ్యాయామాలు చేయడానికి కూడా ఇబ్బంది పడతారు.
గుండె వేగం
ఇనుము అనేది హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఇది శరీరానికి ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ తగ్గితే ఆక్సిజన్ రవాణా తగ్గిపోతుంది. దీనివల్ల గుండె మరింతగా కష్ట పడాల్సి వస్తుంది. ఇలా గుండె అత్యంత వేగంగా పనిచేయడం వల్ల హృదయ స్పందనలో అసమానతలు వస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది.దీన్నే గుండె దడ అని కూడా అంటారు. ఇనుము లోపించడం వల్ల ఈ గుండె దడ వచ్చే అవకాశం ఉంది.
శ్వాస ఆడక పోవడం
నేషనల్ హార్ట్ ,లంగ్, బ్లడ్ ఇన్స్టిట్యూట్ చెబుతున్న ప్రకారం ఇనుము లోపం తక్కువగా ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ శ్వాస ఆడక పోవడం, శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడడం వంటి సంకేతాలు కనిపించవచ్చు. ఇది కూడా శరీరంలో తగినంత ఇనుము లేకపోవడాన్ని సూచిస్తుంది.
ఇతర లక్షణాలు
పైన చెప్పిన మూడు ముఖ్యమైన లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. చర్మం పాలిపోయినట్టు అవుతుంది, ఛాతి నొప్పి, తలనొప్పి, తల తిరగడం, చేతులు, కాళ్లు చల్లగా మారడం, నాలుక నొప్పి రావడం, ఆకలి వేయకపోవడం వంటివి కూడా అనిపిస్తాయి.
మహిళలూ జాగ్రత్త
రక్తహీనత వల్ల మహిళలకే ఎక్కువ సమస్య కలుగుతుంది. దీనికి కారణం ప్రతినెల రుతుస్రావ సమయంలో రక్త నష్టం జరుగుతుంది. అప్పటికే రక్తహీనతతో బాధపడుతున్న మహిళల్లో ఇలా రక్తం బయటికి పోవడం వల్ల సమస్య మరింతగా పెరుగుతుంది. కాబట్టి వారు ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.
ఏం తినాలి?
నాన్ వెజ్ ప్రియులైతే చేపలు, చికెన్, మటన్ వంటివి వారానికి రెండు సార్లు అయినా తినాలి. అలాగే డార్క్ చాక్లెట్, బీన్స్, సోయా, పప్పు దినుసులు, పాలకూర, దానిమ్మ, ఓట్స్, టోఫు, నట్స్, ఎండు ద్రాక్షలు, కొమ్ము శెనగలు వంటివి అధికంగా తినాలి.
Also read: నెలసరి సమయంలో పొట్ట, నడుము నొప్పి ఇబ్బంది పెడుతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.