(Source: ECI/ABP News/ABP Majha)
సమీప భవిష్యత్తులో భారతీయులను పట్టి పీడించే ఆరోగ్య సమస్యలు ఇవే - చెబుతున్న అధ్యయనం
రాబోయే కాలం భారతీయుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు కనిపించే అవకాశం ఉందని కొత్త పరిశోధన చెబుతోంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. సమీప భవిష్యత్తులో మాత్రం ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం కనిపించే అవకాశం ఉందని ఒక అధ్యయనం చెబుతోంది. ప్రజల జీవనశైలిలో వేగంగా కలిగిన మార్పులే కొన్ని అనారోగ్యాలు అధికమవడానికి కారణం అని కూడా ఈ అధ్యయనం తేల్చింది. ఇలా ప్రజలు అధికంగా వ్యాధుల బారిన పడడం దేశ ఆరోగ్య రంగానికే కాదు, మొత్తం సామాజిక ఆర్థిక అభివృద్ధికి కూడా హానికరం. రాబోయే సంవత్సరాలలో భారతీయులను పట్టిపీడించే ముఖ్య వ్యాధులు ఇవే అని ఒక జాబితాను విడుదల చేసింది ఈ అధ్యయనం.
క్యాన్సర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం సమీప భవిష్యత్తులో భారత దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రతి 10 మంది భారతీయుల్లో ఒకరు ఏదో ఒక క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఉందని నివేదిక చెబుతోంది. రొమ్ము క్యాన్సర్ ఇప్పటికే గతంతో పోలిస్తే 1.4% నుంచి 2.8% మధ్య పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే ఈ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. క్యాన్సర్ చికిత్స ఖరీదైనది కావడంతో చాలామంది ఆ ఖర్చును భరించలేక నిలిపివేస్తున్నారు. తద్వారా అర్ధాంతరంగా ప్రాణాలను కోల్పోతున్నారు.
ఇన్‌ఫెర్టిలిటీ
పిల్లలు కలగకపోవడమే ఇన్‌ఫెర్టిలిటీ. దీన్నే వంధ్యత్వం అని కూడా అంటారు. 2019లో జరిగిన ఒక అధ్యయనంలో దాదాపు 14 శాతం మంది జంటలు పిల్లలు లేక ఒంటరి వారయ్యారు. ఇలా పిల్లలు కలగని జంటలు అధికంగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నట్టు తెలిసింది. ప్రతి ఆరు జంటల్లో ఒక జంట వంధ్యత్వంతో బాధపడుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య పది శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. జీవనశైలి, పర్యావరణపరంగా పెరిగిన టాక్సిన్స్ కారణంగా ఇలా పిల్లలు పుట్టడం కష్టతరం అవుతుందని అధ్యయనం అంచనా వేస్తోంది.
పిల్లల్లో వైకల్యాలు
పుట్టే పిల్లల్లో కొన్ని రకాల వైకల్యాలు, అసాధారణతలు వచ్చే అవకాశం రాబోయే సంవత్సరాల్లో పెరుగుతుంది. దీనివల్ల మరణాలు పెరిగిపోయే అవకాశం ఉంది. ఈ అసాధారణతలు, వైకల్యాలు జన్యుపరంగా కూడా వస్తాయని అంచనా. అలాగే మారిన పర్యావరణం వల్ల, విషపూరిత మూలకాల వల్ల కూడా పిల్లలు ఇలా అసాధారణంగా వైకల్యంతో జన్మించే అవకాశాలు ఉన్నాయి.
కంటి శుక్లాలు
పదిహేడు లక్షల మంది భారతీయులు కంటి చూపును కోల్పోవడానికి ప్రధాన కారణం కంటి శుక్లాలు. కొందరు వృద్ధాప్యం కారణంగా ఈ వ్యాధి బారిన పడితే, కొంతమంది గాయాల కారణంగా కంటి శుక్లాలు బారిన పడుతున్నారు. అలాగే కంటి లెన్స్ ను తయారు చేసే కణజాలాన్ని మార్చినప్పుడు కూడా ఈ సమస్య మొదలవుతుంది. లెన్స్ లోని ప్రోటీన్లు, ఫైబర్లు విచ్ఛిన్నం కావడం వల్ల దృష్టి మసకగా మారుతుంది. అలాగే ఇది జన్యుపరంగా వచ్చే అవకాశం కూడా ఉంది. మధుమేహం వంటి వైద్య పరిస్థితిలో కూడా కంటి శుక్లాలు రావడానికి కారణం అని చెప్పుకోవచ్చు.
మధుమేహం
ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ఇబ్బంది పడుతున్న సమస్య మధుమేహం. దాదాపు 75 మిలియన్ల మంది అంటే ఏడున్నర కోట్లకు పైగా జనాభా మధుమేహ వ్యాధిగ్రస్తులు. అదే మన దేశం విషయానికి వస్తే ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నట్టు తేలింది. ఇక్కడ ఈ సమస్య కూడా పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా ఉంది. మధుమేహం అదుపులో ఉండకపోతే గుండె, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది.
గుండె సమస్యలు
వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వంటి కారణాల వల్ల ఎంతోమంది హృదయ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. దాదాపు 55 మిలియన్ల మంది భారతీయులు ఇలా గుండె సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.
ఊబకాయం
ఊబకాయం బారిన పడుతున్న వారిలో ఎక్కువగా పట్టణంలో ఉంటున్న వారే. ఇది జీవనశైలి కారణంగా వస్తున్నది. శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినడం వల్ల ఉబకాయుల సంఖ్య పెరిగిపోతోంది. 2030 నాటికి ప్రపంచంలోనే ఊబకాయం ఉన్న పిల్లల్లో భారత్ రెండో స్థానానికి చేరుకుంటుందని నివేదికలు చెబుతున్నాయి.
జుట్టు ఊడిపోవడం
ఒకప్పుడు జుట్టు ఊడటం అనేది వంశపారంపర్యంగా వచ్చేది. అంటే బట్టతల కేవలం జన్యుపరంగానే వచ్చేది, కానీ భవిష్యత్తులో కేవలం 20 ఏళ్ల వయసులోనే పురుషులకు బట్ట తల రావడం మొదలయ్యే అవకాశం ఉంది. దీనికి కారణం అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్ అని చెప్పాలి. అలాగే తీవ్రమైన మానసిక ప్రభావం కూడా జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతుంది.
Also read: గర్భం ధరించినా ఆ విషయం బయటపడకపోవడమే క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ, ఇలా ఎందుకు జరుగుతుంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.