బర్గర్‌ను ఒక పేపర్లో చుట్టి ఇస్తారు కదా, ఆ పేపర్ ఎంత ప్రమాదకరమైనదో తెలుసా
బర్గర్లు, డోనట్స్ వంటివి ఓ పేపర్లో ర్యాప్ చేసి ఇస్తారు, కానీ ఎక్కువమంది ఆ పేపర్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయరు.
బర్గర్ అంటే ఇష్టమా? మీరు ఎప్పుడైనా తినేటప్పుడు గమనించారా... బర్గర్ చేతికి అంటకుండా ఒక పేపర్ పై పెట్టి ఇస్తారు. అది జస్ట్ పేపరే కదా అని అనుకుంటాం, కానీ భయంకరమైన రోగాలను తీసుకొచ్చే సాధనం. అది నిజానికి పూర్తిస్థాయి కాగితం కాదు, ప్లాస్టిక్ కలిసిన కాగితం. దానివల్ల మానవ ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికీ హానికరం. ఈ విషయాన్ని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఒక అధ్యయనంలో తేల్చింది. అలాంటి పేపర్లను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. దీనిలో పెర్ఫ్లూరోక్టానోయిక్ సల్ఫేట్ (PFOS) అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనంతో తయారుచేసిన పేపర్లను నూనె చేతికి అంటకుండా నిరోధించేలా తయారు చేస్తారు. కాబట్టి వీటిని ఫాస్ట్ ఫుడ్ షాపుల వాళ్ళు అధికంగా వాడతారు. ఈ కాగితాల్లో వాడే రసాయనాలు వెంటనే విచ్చిన్నం కావు. చాలా నెమ్మదిగా విచ్ఛిన్నం అవ్వడం మొదలవుతాయి. అవి అనుకోకుండా శరీరంలో చేరితే కాలేయానికి హాని చేస్తాయి.
కెనడా, అమెరికా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి 42 రకాల పేపర్ ఫుడ్ ప్యాకేజింగ్‌లను పరీక్షించారు. అందులోనే ఈ సాండ్‌విచ్, బర్గర్లకు చుట్టే పేపర్లు, పాప్ కార్న్ సర్వింగ్ బ్యాగులు, డోనట్స్ బ్యాగులు కూడా ఉన్నాయి. వారి అధ్యయనంలో వీటన్నింటిలో కూడా 45% ఫ్లోరిన్ ఉన్నట్టు తెలిసింది. ఫ్లోరిన్ ఎంత ప్రమాదకరమైనదో చెప్పక్కర్లేదు.
కాగితం తినము కదా, పడేస్తాం కదా అని అనుకోవచ్చు. కానీ కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ప్యాకేజింగ్ ద్వారా ఆహారానికి అంటుకుంటాయి. అవి మీ శరీరంలోకి చేరడం చాలా సులువు అని వివరిస్తున్నారు అధ్యయనకర్తల్లో ఒకరైన ప్రొఫెసర్ మిరియం డైమండ్. ముఖ్యంగా ఆహారం వేడిగా ఉన్నప్పుడు ఈ కాగితం మీద పెడితే అతి త్వరగా ఆ కాగితంలోని రసాయనాలు ఆహారానికి అతుక్కునే ప్రమాదం ఉంది. తద్వారా ప్రమాదకరమైన క్యాన్సర్లకు కారణం అవుతాయి. రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. సంతానోత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి. జీవక్రియను నెమ్మదిగా మార్చేస్తాయి. దీనివల్ల ఊబకాయం ప్రమాదం పెరుగుతుంది.
అయినా బర్గర్లు, సాండ్‌విచ్‌లు వంటివి తినడం అంతా ఆరోగ్యకరం కూడా కాదు. కాబట్టి వాటిని నిత్యం తినడం మానుకోవాలి. ఇంట్లోనే చేసే అల్పాహారాలను తినడమే ఆరోగ్యకరం. ఫాస్ట్ ఫుడ్ వల్ల మనకు తెలియకుండానే ప్లాస్టిక్ కణాలు శరీరంలో చేరిపోయే అవకాశం ఉంది. ఈ కణాల వల్ల రకారకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు ఉంది. కాబట్టి ఇంటి ఆహారాన్ని ఎంపిక చేసుకోవడమే ఉత్తమం.
Also read: తల్లికి క్యాన్సర్ ఉన్న విషయాన్ని బయటపెట్టిన రొమ్ము పాల రంగు, ఇదో రకమైన బ్రెస్ట్ క్యాన్సర్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.