High BP: ఈ పోషకలోపంతో హైబీపీ వచ్చే అవకాశం, రాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే
అధిక రక్త పోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అధిక రక్తపోటు సైలెంట్ కిల్లర్. ఎప్పుడు ప్రాణాలు తీస్తుందో చెప్పలేం. అందుకే ఇది వచ్చే వరకు పరిస్థితులను తెచ్చుకోకూడదు, ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకుని, రాకుండా అడ్డుకోవాలి. అధిక రక్తపోటు వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది, దీని వల్ల గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీరు తినే తిండి, పనులు కూడా రోజంతా హెచ్చుతగ్గులకు గురవుతుంది. కాబట్టి జాగ్రత్తగా రక్తపోటును మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అమెరికాకు చెందిన మాయో క్లినిక్ ప్రకారం బ్లడ్ ప్రెజర్లో సిస్టోలిక్ ప్రెషర్ 120 నుంచి 129 వరకు ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిన దశగా చెప్పుకుంటారు. అదే 180 వరకు వెళ్లిందంటే హైపర్‌టెన్సివ్ ఎమెర్జెన్సీగా పరిగణిస్తారు. సాధారణ రక్త పోటు 120/80 mm Hg ఉండాలి. అయితే హైబీపీ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి పొటాషియం లోపం.
అది లోపిస్తే...
మన శరీరంలో పొటాషియం లోపం చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. పొటాషియం ఖనిజ లోపం శరీరాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. పొటాటసియం మన కణాల లోపల ద్రవ స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగపడే ముఖ్యమైన ఖనిజం. అలాగే ఇది గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తుంది. అలాగే కండరాలు, నరాల పనితీరును మెరుగుపరిచేందుకు, ప్రొటీన్ సంశ్లేషణ చేసేందుకు, కార్బోహైడ్రేట్లు అరిగేందుకు ఇది చాలా ముఖ్యమైన పోషకం. అలాగే శరీరం నుంచి అదనపు సోడియం బయటికి పంపించేందుకు కూడా ఇది అవసరం. పొటాషియం రక్తనాళాల గోడలను సడలిస్తుంది. దీనివల్ల రక్తం సాఫీగా ప్రయాణిస్తుంది. రక్త నాళాల గోడలను గుద్దుకుంటూ రక్తం ప్రవహించదు కాబట్టి రక్తపోటు పెరగదు. అలాగే కండరాల తిమ్మిరి కూడా రాకుండా అడ్డుకుంటుంది.
ఇలా అయితే లోపించినట్టే...
పొటాషియం లోపిస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
- మలబద్ధకం
- గుండె దడ
- అలసట
- కండరాలు సన్నబడడం
- కండరాల బలహీనత
- తిమ్మిర్లు పట్టడం
ఏం తినాలి?
పొటాషియం లోపం రాకుండా ఉండాలంటే ఆకుకూరలు, బీన్స్, నట్స్, పాల ఉత్పత్తులు, టూనా వంటి చేపలు, అరటిపండ్లు,సీతాఫలం, ద్రాక్షలు, నారింజ, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, చిక్కుళ్లు వంటివి రోజు వారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రోజుకో అరటి పండు తిన్నా కూడా పొటాషియం లోపం రాదు. ఈ ఖనిజం పుష్కలంగా దొరికేది అరటి పండులోనే.
Also read: పిల్లలపై చదువుల ఒత్తిడి పడకుండా ఉండాలంటే వీటిని తినిపించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.