Myopia In Children: ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి మయోపియా- 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 74 కోట్ల మందిలో ఈ సమస్య
Short-Sightedness: ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి షార్ట్ సైటెడ్‌నెస్ సమస్య ఉందని ఆప్థమాలజీ నివేదిక వెల్లడించింది. 2050 నాటికి ఈ సమస్యతో బాధపడే పిల్లల సంఖ్య 74 కోట్లకు చేరనుంది.
Eye Sight Increased in Children: షార్ట్ సైటెడ్ నెస్ అన్నది కాస్త దూరంగా ఉన్న వస్తువులను చూడడంలో ఎదురయ్యే ఇబ్బంది. దీనిని మయోపియా అని కూడా అంటారు.ఈ సమస్యతో నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లల్లో ప్రతి ముగ్గురులో ఒకరు ఇబ్బంది పడుతున్నారు. 1990ల నుంచి ఈ సమస్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. డిజిటల్ ఏజ్‌లో ఈ సమస్య ఎక్కువైందని చైనా పరిశోధకులు తెలిపారు. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ మయోపియాతో 74 కోట్ల మంది చిన్నారులు బాధపడతారని పరిశోధకులు హెచ్చరించారు.
1990ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైన మయోపియా కేసులు:
కంటి చూపు సమస్యల్లో చాలా కామన్ సమస్యల్లో ఒకటి షార్ట్ సైటెడ్ నెస్ లేదా మయోపియా. ఈ జబ్బుకు సంబంధించి 2023 జూన్ వరకు ప్రచురితమైన 276 సర్వేల్లోని వివిధ స్టాటిస్టిక్స్‌ను చైనాలోని సున్ యాట్-సెన్ యూనివర్శిటీ పరిశోధకులు పరిశీలించారు. వారి పరిశీలన ప్రకారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లలు లేదా టీనేజీ వాళ్లలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ మయోపియాతో బాధ పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్థమాలజీలో వారి పరిశోధన పత్రాలు ప్రచురితం అయ్యాయి. బాల్యంలో మొదలయ్యే ఈ మయోపియా వ్యాధి క్రమంగా పెరిగి ఆ తర్వాత కంటిచూపు పూర్తిగా కోల్పోయే రిస్క్ కూడా ఉంది. చైనా పరిశోధకులు దాదాపు 54 లక్షల మందికి సంబంధించిన స్టాటిస్టిక్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఈ పరిశోధన చేశారు. ఈ 54 లక్షల మందిలో ఆసియా, ఆఫ్రికా కాంటినెంట్స్ నుండి దాదాపు 50 దేశాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య షార్ట్ సైటెడ్ నెస్ ఎదుర్కొంటున్న వాళ్లు దాదాపు 19 లక్షల మంది ఉన్నారు.
Ophthopedia Update: Global prevalence, trend and projection of myopia in children and adolescents from 1990 to 2050: a comprehensive systematic review and meta-analysis https://t.co/ILugVwD74V #Ophthalmology #Ophthotwitter #BJO pic.twitter.com/2Dkf1BeopE
— Ophthopedia (@ophthopedia) September 24, 2024
డిజిటల్ యుగంలో స్క్రీన్‌టైం పెరిగి తగ్గిన ఆటపాటలు:
1990ల నుంచి 2000 సంవత్సరం వరకు ఈ మయోపియా కేసుల్లో 24 శాతం పెరుగుదల కనిపించగా.. 2001 నుంచి 2010 మధ్యలో 25 శాతం… ఆ తర్వాత పదేళ్లలో అంటే 2020 నాటికి 30 శాతం పెరుగుదల కనిపించింది. 2020 నుంచి 2023 నాటికి ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల్లో మయోపియా కేసులలో వృద్ధి 36 శాతం ఉన్నట్లు చైనా పరిశోధకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో ఈ మయోపియో కేసుల వృద్ధి స్థిరంగా పెరుగుతుందే కానీ తగ్గుముఖం పట్టలేదని చెప్పారు. డిజిటల్ యుగంలో చిన్నారులు ఆటలపై కాకుండా స్క్రీన్ టైమ్ పెరగడమే ఈ సమస్యకు కారణమని వివరించారు. చిన్నారులను వీలైనంతగా ఫిజికల్ యాక్టివిటీస్‌పై దృష్టి పెట్టేలా చేయాలని సూచించారు.
1990 నుంచి 2023 మధ్య స్టాటిస్టిక్స్‌ను పరిశీలించినప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లల కంటే.. అప్పుడే అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించిందన్నారు. తూర్పు ఆసియా దేశాల్లో పట్టణాలు నగరాల్లో ఉన్న వారి కంటే గ్రామాల్లో ఉన్న వారికే మయోపియా సమస్య ఎక్కువగా ఉందని తేలింది. హైస్కూల్ విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తూర్పు ఆసియా దేశాల్లో డిజిటల్ మాధ్యమాల ద్వారా జరుగుతున్న విద్యా బోధన కూడా ఓ సమస్యగా పేర్కొన్నారు. తూర్పు ఆసియా దేశాలతో పోల్చితే ఆఫ్రికా దేశాల్లో ఈ సమస్య కాస్త తక్కువగా ఉన్నట్లు చైనా పరిశోధకులు స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే ఎక్కువగా ఈ సమస్య ఉందని చెప్పారు. మగ పిల్లలు బయటకు వెళ్లి ఆటలు ఆడతారని, అమ్మాయిలు ఇంట్లోనే ఉండిపోవడం వల్ల స్క్రీన్ టైం పెరిగి ఈ సమస్య వస్తున్నట్లు తెలిపారు.
2023 నుంచి 2050 మధ్య కాలంలో మయోపియా పెరుగుదల శాతం 9 గా అంచనా వేసినప్పటికీ 74 కోట్లా 59 లక్షలా 2 వేల మంది ఈ సమస్యతో బాధపడే చిన్నారులు ప్రపంచ వ్యాప్తంగా ఉంటారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ప్రభుత్వ వ్యవస్థలు చిన్నారుల్లో ఫిజికల్ యాక్టివిటీస్ పెంచడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.