New Covid Variant UK: ఉన్నది చాలదన్నట్లు మరో కొత్త రకం వచ్చింది!
బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వేరియంట్ కలకలం రేపుతోంది. 16 మందిలో B.1.621 రకం వైరస్‌ను గుర్తించినట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో పది కేసులు లండన్‌లోనే బయటపడ్డాయని వెల్లడించింది.
డెల్టా వేరియంట్ కారణంగా బ్రిటన్‌లో విధించిన ఆంక్షలను ఇప్పుడిప్పుడే సడలిస్తున్న నేపథ్యంలో.. మరో కొత్త రకం(Corona New Variant) బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 16 మందిలో B.1.621 రకం వైరస్‌ను గుర్తించినట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త రకం వైరస్ గురించి విచారణ జరుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. 16 కేసుల్లో పది కేసులను లండన్‌లోనే గుర్తించినట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ ప్రయాణాల వల్లనే ఈ కేసులు బ్రిటన్‌లోకి వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వైరస్ ప్రభావం, సామూహిక వ్యాప్తి గురించి స్పష్టమైన సమాచారం లేదని తెలిపారు.
బ్రిటన్‌లో కొత్త రకం వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) స్పందించింది. ఈ వేరియంట్‌ను తొలిసారిగా జనవరిలో కొలంబియాలో గుర్తించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు అమెరికాలో - 592 కేసులు, పోర్చుగల్ - 56, జపాన్ - 47, స్విట్జర్లాండ్ - 41 కేసులు గుర్తించినట్లు వెల్లడించారు.
మంత్రి వ్యాఖ్యలపై వివాదం..
గత కొద్ది వారాలుగా బ్రిటన్‌లో డెల్టా వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినా ఈ వారంలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం బ్రిటన్‌లో ఆర్ రేటు 1.2 నుంచి 1.4 శాతంగా ఉంది. దీని ప్రకారం కరోనా సోకిన వ్యక్తి వైరస్‌ను ఒకరి కంటే ఎక్కువ మందికి వ్యాప్తి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్(Sajid Javid) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
భారత్ లో పరిస్థితి అంతే..
భారత్ లోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. సాధారణ వేరియంట్లతో పోలిస్తే కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి చాలా వేగంగా ఉన్నట్లు తాజా నివేదికలో తేలింది. కరోనా నిబంధనలు పాటించకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. మూడో వేవ్ ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని తెలిపింది.