Corona cases: దేశంలో కొత్తగా 39,742 కేసులు, 535 మరణాలు
దేశంలో తాజాగా 39 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా థర్డ్ వేవ్ రాబోతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,742 కేసులు నమోదు కాగా.. 535 మంది మరణించారు.
- గడిచిన 24 గంటల్లో 17,18,756 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
- తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,20,551కి చేరింది.
- కొత్త కేసులతో పోల్చితే.. రికవరీల సంఖ్య కూడా దాదాపు సమానంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 39,972 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,05,43,138కి చేరింది.
- ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,08,212కి చేరి.. ఆ రేటు 1.30 శాతానికి తగ్గింది.
- దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. నిన్న 51,18,210 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 43,31,50,864కి చేరింది.
మూడో వేవ్ వచ్చేస్తోంది..
దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 40వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్‌లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని... కాబట్టి రాబోయే వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ అవకాశం ఉందన్నారు.
భారత్‌లో ఇప్పటికే మూడింట రెండు వంతుల జనాభాలో యాంటీబాడీలు ఉన్నాయని సీరమ్ సర్వేలో వెల్లడైన విషయంపై డా.గులేరియా స్పందించారు. ఇప్పటికీ ఒక వంతు జనాభా వైరస్ రిస్క్‌ను ఎదుర్కొంటోందన్న విషయాన్ని ప్రస్తావించారు. యాంటీబాడీలకు సంబంధించి రెండు అంశాలను పేర్కొన్నారు. ఒకటి... శరీరంలో 'X' స్థాయిలో యాంటీబాడీలు ఉంటే రీఇన్ఫెక్షన్ బారినపడకుండా ఉంటారని చెప్పేందుకు ఎటువంటి అవకాశం లేదన్నారు. రెండవది... వైరస్ బారినపడి కోలుకున్నవారిలో క్రమంగా యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతుందన్నారు. అయితే వ్యాక్సినేషన్ పెరగడం మంచి పరిణామని... థర్డ్ వేవ్ మరీ అంత ఆందోళనకరంగా ఉండకపోవచ్చునని అన్నారు.
ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాచించకుండా లైట్ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు లైట్ తీసుకుంటే కరోనా థర్డ్ వేవ్ ప్రమాదకరంగా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. కనుక ప్రజలు నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.