Kerala Boy Recovered: విదేశాల నుంచి ఖరీదైన మందులు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుంటున్న బాలుడు
Kerala Brain Infection Virus: కేరళలో బ్రెయిన్ ఇన్ఫెక్షణ్ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన 14 ఏళ్ల బాలుడు వేగంగా కోలుకుంటున్నాడు. ఈ అరుదైన వ్యాధితో కేరళలో ఇప్పటికే ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
Brain Infection Virus Effect in Kerala | కేరళ రాష్ట్రంలో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరిన 14 ఏళ్ల బాలుడు వేగంగా కోలుకుంటున్నాడని అక్కడి వైద్యులు తెలిపారు. మెదడును తినే అమీబా లాంటి ఈ అరుదైన వ్యాధితో కేరళలో ఇప్పటికే ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. దీంతో కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలోని మేలాది ప్రాంతంలో జూలై 1న 14 ఏళ్ల బాలుడికి వ్యాధి సోకినట్టు గుర్తించిన వెంటనే విదేశాల నుంచి ఖరీదైన మందులతో అత్యాధునిక వైద్యసేవలను అందించి విజయం సాధించామని వైద్యులు తెలిపారు.
బాలుడి కోసం విదేశాల నుంచి ఖరీదైన మందులు
జూలై 1న 14 ఏళ్ల బాలుడు జ్వరంతో మేలాది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడని ఆరోగ్య కార్యకర్తలు తెలిపారు. అతని లక్షణాలను బట్టి మెదడును తినేసే అమీబా వ్యాధిగా అనుమానించారు. అదే రోజు బాలుడు మూర్ఛతో కూడా పడిపోయి కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు గుర్తించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న వైద్యులు వేగంగా చర్యలు తీసుకుని సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించి ఈ పరిస్థితికి చికిత్స చేయడానికి మిల్టెఫోసిన్ అనే కీలకమైన ఔషధాన్ని అందించింది. అదే తరువాతి మూడు వారాల్లో బాలుడు కోలుకోవడంలో కీలక పాత్ర పోషించింది.
ఈ వ్యాధి సోకితే బతకడం చాలా అరుదు..
ఈ కేసులో ఇప్పటికే జూలై 3న, రాష్ట్రంలో 14 ఏళ్ల బాలుడు మరణించాడు. అంతకుముందు మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక, కన్నూర్‌కు చెందిన మరో 13 ఏళ్ల బాలిక ఈ అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ కారణంగా మే 21, జూన్ 25 న మరణించారు. జిల్లా ఆరోగ్యశాఖ అందించిన సమాచారం ప్రకారం, ఈ వ్యాధి నుండి కోలుకోవడం చాలా అరుదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు కేవలం 11 మాత్రమే ఉన్నాయని తెలిపారు. 97 శాతం మరణాల రేటును కలిగి ఉన్న ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించి సమగ్ర వైద్య సహాయం చేయడం ద్వారా విజయవంతంగా బాలుడిని కాపాడామని ఆనందరం వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ ఆస్ట్రేలియాలో 1960లో తొలిసారిగా పీఏఎం కేసు వెలుగు చూసింది. అనంతరం క్విన్‌లాండ్, అమెరికాల్లో కేసులు కనిపించాయి. 1962 నుంచి 2001 వరకు అమెరికాలో 154 కేసులు నమోదయ్యాయి. దీంట్లో కేవలం నలుగురు మాత్రమే బతికారంటే ఇది ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో కూడా గతంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. తొలిసారిగా 2017లో అలప్పుజలోని తిరుమల వార్డులో పీఏఎం కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత 2020, 2022లో కోజికోడ్‌లో మరో ఐదు కేసులు నమోదయ్యాయి. వారంతా జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చ వంటి లక్షణాలతో చనిపోయారు.
వైద్య సిబ్బందికి అభినందనలు
బాలుడు కోలుకోవడంలో కీలకపాత్ర పోషించిన వైద్య బృందాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అభినందించారు. వర్షాలు కరుస్తున్నందున ఆరోగ్య శాఖ నివారణ చర్యలను ముమ్మరం చేసి అమీబిక్ మెదడువాపు ముప్పు నివారణకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ వైరాలజీ సహకారంతో వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు పరమాణు పరీక్షా వ్యవస్థల తయారీపై చర్చించేందుకు సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో జరిగిన సమావేశంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా అపరిశుభ్రమైన నీటిలో స్నానం చేయకూడదని పలు సూచనలు చేశారు. అలాగే నీటికుంటలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆదేశించారు. ఈత కొలనులలో సరైన క్లోరినేషన్ ఉండాలని, పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నందున నీళ్లలోకి దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.