Aging: ఈ ఆహారాలను రోజూ తింటే మీరు త్వరగా ముసలివాళ్లు కారు
ముసలితనాన్ని ఎవరు ఇష్టపడతారు? దానిని దూరంగా ఉంచాలంటే కేవలం పోషకాహారం వల్లే వీలవుతుంది.
మీరు త్వరగా ముసలితనం బారిన పడకూడదనుకుంటున్నారా? దాన్ని ఆపడం అసాధ్యమే, కానీ కాస్త దూరం జరపచ్చు. అందుకు కొన్ని రకాల పోషకాహారాలు రోజూ తినవలసిన అవసరం ఉంది. మనం వృద్ధాప్యం బారిన త్వరగా పడతామా లేదా అనేది నిర్ణయించేది మెదడు. ఇది మన శరీరంలో ఒక ప్రధాన అవయవం. మనం తినడం నుండి శ్వాస తీసుకోవడం వరకు నిద్రా, భావోద్వేగాలు... ఇలా అన్ని విధులను నియంత్రించేది మెదడే. మెదడుకు ఆరోగ్యాన్నిచ్చే మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం మొత్తం ఆ ప్రభావం కనిపిస్తుంది. శరీర వ్యాధులను, శరీరంలో ఇన్ష్లమ్మేషన్‌ను దూరం పెడుతుంది. ఇలా జరగాలంటే మెదడు ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకోవాలి. ఇవి మీరు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా కాపాడతాయి.
గోధుమలు
ఎక్కువమంది బరువు తగ్గడానికి గోధుమలతో చేసిన రోటీలను, చపాతీలను తింటుంటారు. అంతకుమించి దానివల్ల లాభం లేదనుకుంటారు. కానీ మెదడుకు గోధుమలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లైసిథిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నారింజ
నారింజ పండ్లు దాదాపు ఏడాదంతా దొరుకుతాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి సహజంగానే రోగనిరోధక శక్తిని అందిస్తాయి. కోలిన్ పోషకంతో నిండి ఉంటాయి. ఈ కోలిన్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే నాడీ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. కాబట్టి రోజుకొక నారింజపండు తింటే మీ శరీరం, చర్మం మెరవడమే కాదు మెదడు కూడా ఆరోగ్యంగా ఉండి ఏజింగ్ ఛాయలను దూరంగా ఉంచుతుంది.
అవకాడోస్
అవకాడో పండ్లు మనదేశంలో పండవు. కానీ అన్ని పండ్ల మార్కెట్లలో ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడులో, శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను నిరోధించే సామర్థ్యం వీటికి ఉంటుంది. రోజుకో అవకాడో పండు తింటే వృద్ధాప్యం కాస్త ఆలస్యంగా వస్తుంది.
ఇవే కాకుండా గుడ్డు, తృణధాన్యాలు, పాలు, చామంతి పూల టీ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో కూడా మెదడు ఆరోగ్యానికి సంబంధించి, జ్ఞాపకశక్తిని పెంచే కొన్ని మూలికలు ఉన్నాయి. వాటిని కూడా ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. శంఖం పూలు, బ్రహ్మి మూలికలో చేసిన పేస్టులను, లేహ్యాలను, పొడులను వాడడం మంచిది..
పైన చెప్పిన ఆహారాలన్నీ తినడం వల్ల శరీరంలోనూ మెదడులోనూ ఆక్సికరణ ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల వృద్ధాప్యం, అల్జీమర్స్ వంటివి త్వరగా రావు.
Also read: తీవ్రమైన తలనొప్పి బ్రెయిన్ స్ట్రోక్‌కు ముందస్తు సంకేతం కావచ్చు, జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.