Inhale Plastic: మనం పీల్చే ప్లాస్టిక్ తో వారానికో క్రెడిట్ కార్డ్ తయారు చేయొచ్చు, ఇదంతా ఎక్కడికి పోతుందో తెలుసా?
Inhale Plastic: మనం రోజూ పీల్చే ప్లాస్టిక్ అణువుల నుంచి వారానికి ఒక క్రెడిట్ కార్డు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు గతంలో తేల్చారు. ఇదంతా ఎక్కడికి పోతుందా తాజాగా వెల్లడించారు.
Inhale Plastic: మనిషి శరీరంలోకి ప్రతి గంటకు 16.2 బిట్స్ మైక్రోప్లాస్టిక్..శ్వాస ద్వారా ప్రవేశిస్తుందని 2019వ సంవత్సరంలో శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది. వారంలో పీల్చే ఈ ప్లాస్టిక్ పరిమాణం ఒక క్రెడిట్ కార్డు సైజులో ఉంటుందని తేల్చారు. అయితే శరీరంలోకి వెళ్లిన ఈ ప్లాస్టిక్ అణువులు శ్వాసకోశ వ్యవస్థలో ఎలా కదులుతాయో తాజాగా గుర్తించారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ప్రకారం మైక్రోప్లాస్టిక్స్ 0.2 అంగుళాల (5 మిల్లీమీటర్ల) కంటే చిన్న పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ అణువులు. ఇవి పారిశ్రామిక వ్యర్థాలు, వినియోగ వస్తువులు విరిగినప్పుడు గాలిలో కలిసిపోతాయి. కంటికి కనిపించనంత చిన్న స్థాయిలో ఉండే ఈ ప్లాస్టిక్ అణువులు గాలితో పాటు విస్తరిస్తాయి. వీటిని గాలితో పాటు పీల్చినప్పుడు శరీరంలోకి వెళ్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
విషపూరిత మైక్రోప్లాస్టిక్స్ మానవ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా శ్వాసకోశలో సమస్యలు ఎలా సృష్టిస్తాయో ఇప్పటికే చాలా అధ్యయనాలు జరిగాయి. మైక్రోప్లాస్టిక్ అణువులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని ఇటీవల పరిశోధనలు కూడా తేల్చాయి. అయితే శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించి మైక్రోప్లాస్టిక్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని ఓ కంప్యూటర్ మోడల్ ఉపయోగించి తాజాగా పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు జూన్ 13వ తేదీన ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
మైక్రోప్లాస్టిక్ లు శరీరంలో ఎక్కడికి వెళ్తాయి?
శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించే మైక్రోప్లాస్టిక్ లు నాసికా కుహరం, ఒరోఫారింక్స్ లేదా గొంతు వెనక భాగంలో ఉన్న హాట్ స్పాట్‌లలో పేరుకుపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఎంత వేగంగా మన శరీరంలోకి వెళ్తున్నాయనే దాన్ని బట్టి ఎంత మైక్రోప్లాస్టిక్ పేరుకుపోయి ప్రభావం చూపిస్తాయో అంచనా వేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మానవ కణాలను చంపుతాయి!
మానవ శరీరంలోకి ప్రవేశించే మైక్రోప్లాస్టిక్స్ అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. అలాగే ఇవి మానవ కణాలను చంపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మైక్రోప్లాస్టిక్ వల్ల పేగులో మంట సహా సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతున్నట్లు ఎలుకల్లో జరిపిన పరిశోధనల్లో తేలింది. మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి వైరస్ లను, బ్యాక్టీరియాను కూడా మోసుకెళ్తాయని ఇవి మరింత హాని కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: Fatigue: ఎప్పుడూ అలసటగా ఉంటుందా? ఈ అనారోగ్య సమస్యలు కారణం కావచ్చు
శరీరంలోకి ప్లాస్టిక్ చేరకుండా ఏం చేయాలంటే?
* టీ బ్యాగులను పాలీ ప్రొఫైలిన్ అంటే ప్లాస్టిక్ రకాన్ని కలిపి చేస్తారు. వీటిని వేడి నీటిలో ముంచినప్పుడు వాటి కణాలు టీలో కలిపి శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.
* ప్లాస్టిక్ కప్పులో టీ తాగకూడదు. ఈ అలవాటు మైక్రోప్లాస్టిక్ ను శరీరంలో చేరేలా చేయవచ్చు.
* చాలా మంది ఫుడ్ ను వేడి చేసేందుకు మైక్రోవోవెన్లో పెట్టి వేడి చేస్తారు. గ్లాస్ కంటైనర్లో అలా చేసుకోవడం ఉత్తమం. కానీ చాలా మంది ప్లాస్టిక్ బాక్సుల్లో, యూజ్ అండ్ త్రో బాక్సుల్లో చేస్తారు. దీనివల్ల మైక్రో ప్లాస్టిక్ ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది కాబట్టి వాటిల్లో వేడి చేయడం మానేయాలి.
* సముద్ర చేపలు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎన్నో ప్లాస్టిక్ వ్యర్థాలు నీటి ద్వారా చేపల శరీరాల్లోకి చేరుతున్నాయి. వాటిని తినడం ద్వారా ఆ ప్లాస్టిక్ మన శరీరంలోకి వస్తుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial