Orange Benefits: కరోనాకు భయపడుతున్నారా? రోజుకో నారింజ తినండి, ఎందుకంటే..
నారింజను ఎలా తీసుకున్న ఆరోగ్యానికి అది చాలా మేలును చేకూరుస్తుంది. కాని నారింజను రసం చేసుకొని తాగటం కన్నా తినడమే మంచిది అని అంటున్నారు కొంతమంది నిపుణులు.
నారింజ.. కాస్త పుల్లగా, మరికాస్త తియ్యగా నోరూరిస్తుంది. అయితే, కొందరికి వీటిని ఒలుచుకుని తినాలంటే చాలా బద్దకం. దీంతో జ్యూస్ చేసుకుని తాగేస్తుంటారు. వాస్తవానికి జ్యూస్ కంటే.. నేరుగా పండును తింటేనే ఆరోగ్యానికి మేలు. పైగా, కరోనా మరోసారి దాడికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నారింజ పండ్లను తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే..
జ్యూస్ కంటే పండు మేలు
నారింజను జ్యూస్ చేసినప్పుడు.. అందులోని ఫైబర్ గుణాలు దెబ్బతింటాయి. అదే నేరుగా పండునే తినేస్తే.. అన్ని పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి. 240 మిల్లి లీటర్ల నారింజ రసం, 2 నారింజ పండ్లకన్నా ఎక్కువ చక్కెరను కలిగి ఉంటుంది. మలబద్దకం సమస్యను పరిష్కరించేందుకు, బరువు తగ్గించేందుకు నారింజలోని ఫైబర్ ముఖ్య పాత్రను పోషిస్తుంది. కాబట్టి, నారింజను జ్యూస్‌గా కాకుండా పండులాగానే తినండి.
తాజా పండ్లతోనే జ్యూస్ చేసుకోవాలి
ఒక వేళ మీరు నారింజ రసాన్ని తాగాలి అనుకుంటే.. నాణ్యమైన పండ్లను ఎంచుకోండి. జ్యూస్ చేసే ముందు పండు తాజాగా ఉందో లేదో చూడండి. ప్రిజర్వేటివ్స్ లేని పండ్లను ఎంచుకోండి. సాధారణంగా నారింజ పండ్లను తినడం వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురికారు. చాలా అరుదుగా అలర్జీలకు గురవుతారు. అయితే, గుండెల్లో మంటతో బాధపడుతున్నవారు ఈ పండు వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. నారింజలో ఉండే ఆమ్లాలు గుండెల్లో మంటను మరింత ఎక్కువ చేయొచ్చు. గుండె మంటతో బాధపడేవారికి నారింజ పండుగానీ, జ్యూస్ గానీ ఇవ్వకపోవడమే ఉత్తమం.
కోవిడ్ సమయంలో నారింజను తింటే లభించే ప్రయోజనాలు ఇవే
విటమిన్-C లభిస్తుంది: నారింజలో 116.2 శాతం విటమిన్-C ఉంటుంది. నారింజలోని విటమిన్-సి వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి ఎంత ముఖ్యమో తెలిసిందే. నారింజలో ఉండే విటమిన్-C రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వినికిడి శక్తిని పెంచడానికీ ఉపయోగపడుతుంది.
చర్మాన్ని రక్షిస్తుంది: నారింజలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి. రోజుకో నారింజను తినడం వల్ల చర్మం వృద్ధాప్య ఛాయలు లేకుండా చేస్తుంది. 50 ఏళ్ల వయస్సులో రోజుకో నారింజ తింటే యవ్వనంగా కనిపిస్తారట.
రక్త పోటును నియంత్రిస్తుంది: నారింజలో ఉండే విటమిన్ B6, మెగ్నీషియం శరీరంలో హెమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడి రక్త పోటును తగ్గిస్తుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: నారింజ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడుతుందని అమెరికాకు ఓ పరిశోధన సంస్థ వెల్లడించింది.
ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది: నారింజలో ఐరన్ పెద్దగా ఉండదు. కానీ, ఐరన్‌ను శరీరం గ్రహించేందుకు మాత్రం తోడ్పడుతుంది. అందుకే డాక్టర్లు రక్తహీనత సమస్యతో బాధపడేవారికి నారింజ తినాలని చెబుతుంటారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: నారింజలో ఉండే పోషకాలు గుండెకు సంబంధించిన రోగాలను నివారించడంలో సహాయపడతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: నారింజలో ఉండే ఫైబర్ చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. భోజనం తరువాత పెరిగే బ్లడ్ షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసేందుకు నారింజ ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ నుంచి కాపాడుతుంది: నారింజలో విటమిన్ D-లిమోనేన్ ఉంటుంది. అది ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లను నియంత్రిస్తుంది. నారింజలో ఉండే విటమిన్ -C, యాంటీఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచి కాన్సర్‌తో పోరాడేందుకు సహకరిస్తుంది.
కంటి చూపును మెరుగుపరుస్తుంది: నారింజలో ఉండే కెరోటినాయిడ్ విటమిన్-Aను కలిగి ఉంటుంది. ఇది కంటి చూపుకు సంబంధించిన శ్లేష్మ పొరలను కాపాడుతుంది. అంతేకాదు వయస్సు పెరగటం వల్ల వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తుంది.
మలబద్ధకాన్ని నివారిస్తుంది: నారింజలో కరిగే ఫైబర్లు, కరగని ఫైబర్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సరళంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.
Also Read: BRAT డైట్ అంటే ఏంటి? బరువు తగ్గేందుకు ఇది పాటించవచ్చా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.