మీ వయస్సు 40 దాటిందా? ఇకపై ఈ ఆహారమే తీసుకోండి
వయస్సు పెరిగే కొద్ది రోగాలు కూడా పెరుగుతాయి. కాబట్టి 30 ఏళ్ల నుంచే మనం జాగ్రత్తపడాలి. కానీ, బిజీ లైఫ్ వల్ల సాధ్యం కాదు. కాబట్టి 40 ఏళ్ల వయస్సులోనైనా ఈ ఆహార నియమాలు పాటిస్తే బెటర్.
పెరుగుతున్న వయసు చాలా రకాలుగా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. హార్మోన్ల పనితీరు మారడం వల్ల జీవక్రీయల్లో తేడాలు రావడం వల్ల ఆరోగ్యంలో చాలా తేడాలే గమనించవచ్చు. కొన్ని సార్లు రోజువారీ జీవితం కూడా కష్టంగా మారుతుంది. ఆరోగ్యం కాపాడుకోవడం ఇక సాధ్యం కాదేమో అనే నిరాశ కూడా కలుగవచ్చు. కానీ అలాంటి నిరాశ అవసరం లేదు. తీసుకునే ఆహారం మీద శరీరానికి అందుతున్న పోషకాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. ఒక వయసు తర్వాత కొన్ని రకాల పదార్థాలు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు 40 ఏళ్లు దాటిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి.
బెర్రీస్
40 సంవత్సరాల తర్వాత కూడా ఆరోగ్యంగా, చురుగ్గా ఉండే శరీరం కావాలంటే తప్పనిసరిగా యాంటీఆక్సిడెంట్ల అవసరం ఉంటుంది. దీనికోసం యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తీసుకోవడం తప్పదు. ఇందుకోసం బెర్రీలు తీసుకోవచ్చు. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నిరోధిస్తాయి. ఫ్రీ రాడికల్స్ డీఎన్ఏ పాడైపోవడానికి, చర్మ సౌందర్యం దెబ్బతినడానికి కారణం అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కేవలం అందం కోసం మాత్రమే కాదు గుండె, మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాదు బెర్రీలు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఫైబర్ కూడా లభిస్తుంది. నలభై దాటిన తర్వాత బెర్రీలు హెల్దీ స్నాక్ అని మరచి పోవద్దు. ఎందుకంటే ఇది బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తాయి.
వాల్నట్
40 దాటిన మహిళలకు వాల్నట్ చాలా మంచి స్నాక్. ఇవి యాంటీఏజింగ్ ప్రక్రియలో ముఖ్య పాత్ర వహిస్తాయి. వాల్నట్స్ ఆక్సిడేషన్ ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. అందువల్ల ఇన్ఫమ్లేషన్ తగ్గి కణజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. కరకరలాడే స్నాక్ ఐటమ్ తినాలని అనిపించినపుడు వాల్నట్ ఒక మంచి ఆప్షన్. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బీపీ, శరీర బరువు అదుపులో ఉంటాయి. జీవక్రియల రేటు కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది.
బ్లాక్ బీన్స్
బీన్స్ ఎప్పుడైనా మంచి ఆప్షన్. 40 దాటిన మహిళల్లో మెనోపాజ్ దగ్గరగా ఉంటుంది కనుక వీరికి ప్రీ మెనోపాజ్ సమస్యలు మొదలవుతాయి. బ్లాక్ బీన్స్ లో మెగ్నీషియం, పోటాషియం పుష్కలంగా ఉంటాయి. రెండు రకాల ఖనిజాలు హార్మోన్ల నియంత్రణకు చాలా ముఖ్యమైనవి. మెనోపాజ్ వయసుకు వచ్చిన తర్వాత చాలా మంది మహిళల్లో ఎముక సాంద్రత 20 శాతం వరకు కోల్పోతారు. శరీరంలో 60 శాతం వరకు మెగ్నీషియం ఎముకల్లో నిల్వ ఉంటుంది. మెనోపాజ్ లో సైతం తగినంత మెగ్నీషియం, పొటాషియం తీసుకోవడం చాలా అవసరం. రక్తపోటు, గుండెజబ్బులను నివారించేందుకు ఈ రెండు మినరల్స్ చాలా అవసరం.
వయసు ఏదైనా సమతుల పోషకాహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కచ్చితంగా ఆహారంలో ఎక్కువ పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం అవసరం. వయసు పెరిగే కొద్దీ తీసుకునే ఆహారం విషయంలో మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళలే కాదు.. పురుషులు కూడా 40 ఏళ్లు దాటిన తర్వాత నిత్యం వ్యాయమం చేస్తూ ఫిట్‌గా ఉండాలి. మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలి.
Also read: తేనెటీగలు అంతరించిపోతే, మానవజాతి కూడా ముగిసిపోతుంది - అదెలా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.