Menopause: మెనోపాజ్ ముందస్తుగా వస్తే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు
మహిళల జీవితంలో మెనోపాజ్ దశ చాలా ముఖ్యమైనది.
సాధారణంగా మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉంటుంది. ఇది గుండెకు రక్షణగా నిలుస్తుంది. కానీ పురుషుల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండదు. అందుకే ఆడవారితో పోలిస్తే గుండెజబ్బులు మగవారిలో పదేళ్ల ముందుగానే వస్తాయని చెబుతారు. అయితే మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరిలో అయితే మెనోపాజ్ ముందస్తుగా వస్తుందో... అంటే నెలసరి నిలిచిపోతుందో, వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతోందనిచెబుతోంది ఒక అధ్యయనం.
సాధారణంగా మహిళల్లో మెనోపాజ్ 45 ఏళ్లు దాటాక వస్తుంది. అలా వస్తే సరైన సమయానికి వచ్చినట్టే లెక్క. కొందరికి 45 ఏళ్లు రాకముందే నెలసరి నిలిచిపోతుంది. దీన్ని ‘ఎర్లీ మెనోపాజ్’ అంటారు. మరికొందరిలో 40 ఏళ్లు రాకముందే నెలసరి నిలిచిపోతుంది. దీన్ని ‘ప్రీ మెచ్యూర్ మెనోపాజ్’ అంటారు. ఇలాంటి వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్టు కొరియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన కర్తలు చేసిన అధ్యయనంలో తేలింది. గుండె వైఫల్యం చెందడం, గుండె కొట్టుకొనే వేగం మారిపోవడం వంటివి ఎక్కువగా వీరిలో కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. మహిళల్లో నెలసరి ముందస్తుగా నిలిచిపోవడం కూడా గుండె జబ్బు రావడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. మెనోపాజ్ ముందస్తుగా రాకుండా, సరైన సమయానికి రావాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ధూమపానం, ఆల్కహాల్ తాగడం వంటివి మానేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొవ్వు, తీపి పదార్థాలు తగ్గించాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల మోనోపాజ్ ముందుగా రాదు, దీనివల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
ఎలా తెలుస్తుంది?
40 ఏళ్లు దాటాక 12 నెలల పాటు ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోతాయో వారు మెనోపాజ్ దశకు చేరుకున్నట్టు లెక్క. అంటే వారికి భవిష్యత్తులో ఇక ఋతుస్రావం జరగదని అర్థం. ఆ మహిళలు ఇక పునరుత్పత్తి చేయలేరు, అంటే గర్భం ధరించలేరు. మెనోపాజ్ వచ్చాక మహిళ శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతాయి. దీని ఫలితం గానే పీరియడ్స్ సరిగా రావు. ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇది గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి, వారిలో ఆస్ట్రోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఈస్ట్రోజెన్ లోపం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే మూత్రాన్ని ఎక్కువ కాలం ఆపుకోలేరు.
Also read: పాలతోనే కాదు పప్పుతో కూడా పనీర్ తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.