కాళ్లు, పాదాల్లో వాపు కనిపిస్తోందా? నిర్లక్ష్యం వద్దు ప్రమాదకరం కావచ్చు
నొప్పి లేకపోవడం వల్ల చాలా మంది కాళ్లు, పాదాల్లో వాపును సమస్యగా భావించరు. కానీ అసలు ఈ వాపులు ఎందుకు వస్తాయి? ప్రమాదకరమా? కాదా? అనే సందేహాలు ఉంటూనే ఉంటాయి. ఈ సందేహాలు తీర్చేందుకే ఈ ఆర్టికల్
రెండు మూడు గంటల పాటు కదల కుండా కూర్చుని ప్రయాణం చేసినా కొందరికి కాళ్లలో వాపులు వస్తాయి. నొప్పి ఉండకపోవచ్చు. కానీ నీరు చేరినట్టు కనిపిస్తాయి. కొందరిలో ఇలా వాపు వచ్చిన భాగంలో నొక్కి చూస్తే గుంటలు కూడా పడతాయి. నొప్పి లేకపోవడం వల్ల చాలా మంది దీన్ని సమస్యగా భావించరు. కానీ అసలు ఈ వాపులు ఎందుకు వస్తాయి? ప్రమాదకరమా? కాదా? అనే సందేహాలు ఉంటూనే ఉంటాయి. ఈ సందేహాలు తీర్చే ప్రయత్నం ఈ ఆర్టికల్ ద్వారా చేద్దాం.
ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉంటే కాళ్లు, పాదాల్లో వాపు వస్తుంటుంది చాలా మందిలో. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే కాళ్లు పాదాలు వాచి పోతాయి. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే కారణం తెలిస్తే అది ప్రమాదకరమా కాదా అనేది నిర్థారణ చెయ్యడానికి వీలవుతుంది. కొన్ని సార్లు ప్రెగ్నెన్సీలో వచ్చే న్యూరోపతి వల్ల కావచ్చు. కానీ, కొందరిలో అకారణంగా కాళ్లు, పాదాల్లో వాపుకు కొన్ని అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయి.
సాధారణ వాపు: కాళ్లు పాదాలలో వాపుకు ఇది అన్నింటిలోకి చాలా సర్వసాధారణ కారణం. చాలా సమయం పాటు కూర్చుని ఉండడంతో గురుత్వాకర్షణ వల్ల శరీరంలోని నీరు పాదాలలో చేరుతుంది. ఇది ఎవరికైనా జరగవచ్చు. దీనికి వయసుతో పెద్దగా సంబంధం లేదు. ఇలాంటి వాపు పాదాలు, చీలమండల్లో ఉంటుంది. ఇదేమి పెద్ద ప్రమాదకరం కాదు. కాసేపు నడిస్తే తగ్గిపోతుంది.
రక్తనాళాల వాల్వ్స్ లో లీకేజి: పాదాల్లోని రక్త నాళాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అలా పని చేసేందుకు వీలుగా రక్తనాళాలలో వాల్వ్ లు ఉంటాయి. ఈ వాల్వ్‌ల పనితీరు సరిగా లేనపుడు కాళ్లు, పాదాల్లో నీరు చేరుతుంది. అందువల్ల పాదాల్లో, కాళ్లలో వాపు వస్తుంది. దీని కోసం కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు అవసరం తెలుసుకోవడం మంచిది.
న్యూరోపతి: న్యూరోపతిలో పాదాల్లో ఉండే చిన్నచిన్న నాడులు పని చేయవు. సాధారణంగా ఇలాంటి స్థితి డయాబెటిస్ తో బాధ పడేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా నాడి సంబంధ సమస్యలు ఏర్పడినపుడు పాదాల్లో వాపు వస్తుంది. ఇది చాలా సార్లు డిపెండెంట్ ఎడేమా లాగే ఉంటుంది. కానీ ఒక్కోసారి పాదాల్లో సూదులు గుచ్చినటువంటి నొప్పి ఉండొచ్చు లేదా పాదాలు చాలా సెన్సిటివ్ గా మారి పాదాల్లో మంటలు కూడా ఉండొచ్చు. వాపు తో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి షుగర్ లెవెల్స్ చూసుకోవడం, డాక్టర్ ను కలవడం మంచిది.
శరీరంలో అదనపు నీరు: గుండె జబ్బు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి కొన్ని రకాల అనారోగ్య స్థితుల్లో శరీరంలో నీరు అదనంగా చేరుతుంది. ఇలా చేరిన నీరు శరీర భాగాలన్నింటి నుంచి గురుత్వాకర్షణ దిశలో పయనించి పాదాల్లో చేరుతుంది. అందువల్ల పాదాల్లో వాపు వస్తుంది. కాళ్లతో పాటు ముఖం, కళ్లు వాచినట్టు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలిసి వాపు ఎందుకో నిర్ధారణ చేసుకోవడం తప్పనిసరి. ఇది ప్రమాదకరమైన కిడ్నీ వ్యాధికి సంకేతం కావచ్చు.
ప్రెగ్నెన్సీ: కాళ్లలో వాపు రావడం గర్భవతుల్లో సహజం. శరీరంలో జరిగే హార్మోన్ల మార్పు వల్ల ఇలాంటివి జరుగుతాయి. అంతేకాదు గర్భవతులు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సరైన వ్యాయామం లేకపోతే వెరికోస్ వీన్స్ అనే రక్త నాళాల సంబంధించిన సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక కాళ్ల వాపులు వస్తున్నట్టు అనిపిస్తే తప్పనిసరిగా చిన్న పాటి వ్యాయామం లేదా కొద్ది దూరం నడవాలి.
Also read: పనీర్ అంటే ఇష్టమా? అధికంగా తింటే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు