Heart: సెలవురోజుల్లో వచ్చే ‘హార్ట్ సిండ్రోమ్’ గురించి తెలుసా? దీని సంకేతాలు ఎలా ఉంటాయంటే
మీరు నమ్మిన నమ్మకపోయినా సెలవు రోజుల్లో వచ్చే గుండె సమస్య ఉంది. దీని గురించి తెలుసుకోవాలంటే చదవండి
‘హాలిడే హార్ట్ సిండ్రోమ్’
ఇది కేవలం సెలవు రోజుల్లో మాత్రమ కలిగే అవకాశం అధికం. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అమెరికాలో హృదయ సంబంధ వ్యాధులు కలగడానికి సాధారణ కారణాల్లో ఇదీ కూడా ఒకటి. సెలవు వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోతారంతా. ఆ రోజంతా తాగడం, తినడం, తిరగడం ఇవి చేయడానికి ఇష్టపడతారు. అందులో తాగడం అనేది ఉంది చూశారు, అదే సమస్య మొత్తానికి కారణం. పండుగ సెలవుల్లో మద్యపానానికే ప్రాధాన్యత ఎక్కువ. అడ్డూ అదుపు లేకుండా తాగే వారు ఎంతో మంది. అలా తాగి తాగి గుండెకు చేటు తెచ్చుకుంటారు. ఫలితంగా గుండె సమస్యల బారిన పడతారు.
ఎందుకా పేరు?
కేవలం సెలవు రోజుల్లోనే గుండె ఆరోగ్యం పాడవుతుందని కచ్చితంగా చెప్పలేం, అయితే హాలిడే హార్డ్ సిండ్రోమ్ అనే పేరు ఎందుకు పెట్టారు అనే సందేహం రావచ్చు. గుండె సమస్యలు ఎప్పుడైనా బయటపడవచ్చు. కానీ హాలీడే సీజన్లో తినే క్వాంటిటీ పెరిగిపోతుంది. రకరకాల మద్యపానీయాలు వాడకం, వాటితో అధిక కేలరీలు ఉండే స్నాక్స్ తినడం చేస్తారు. దీని వల్ల గుండెకు చాలా చేటు జరుగుతుంది. గుండెపై చాలా భారం పడుతుంది. దీంతో గుండె సమస్యలు చిన్నగా మొదలవుతుంది.
హాలిడే హార్ట్ సిండ్రోమ్ లక్షణాలు
సెలవు రోజుల్లో బాగా తాగి, తిన్న వారిలో గుండెకు హాని కలిగే అవకాశం ఉంది. అలా హాని కలిగితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
1. గుండె దడ
2. అలసట
3. తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది
4. ఛాతీలో అసౌకర్యం
5. శ్వాస ఆడకపోవుట
దీన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. కార్డియోవాస్క్యులార్ కాంప్లికేషన్‌కు దారితీయవచ్చు. సెలవుల్లో బాగా తాగి, తిన్న తరువాత పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించండి. చికిత్స చేయకుండా వదిలేస్తే పరిస్థితి చేజారిపోవచ్చు. ఇది ప్రాణాంతక అరిథ్మియాగా మారిపోవచ్చు. నిమోనియా కూడా ఎటాక్ చేయచ్చు. రక్త గడ్డ కట్టి రక్తనాళంలోని రక్త ప్రసారం సరిగా కాక థ్రోంబోఎంబోలిజం రావచ్చు.
ఆ సమయంలో ఎక్కువ...
హాలిడే హార్ట్ సిండ్రోమ్ కేసులు అధికంగా కిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో నమోదవుతున్నట్టు చెబుతున్నాయి సర్వేలు. ముఖంగా వయసు పెరిగిన వారిలో, మధుమేహం ఉన్నవారి, కరోనరీ ఆర్టరీ వ్యాధుల చరిత్ర ఉన్న వారిలో ఈ సిండ్రోమ్ వెలుగు చూస్తోంది. సెలవుల్లో ఆనందం, ఉల్లాసంగా ఉండటం చాలా అవసరం, అలాగే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
Also read: బుగ్గల్లో సొట్ట పడటానికి ఇదే కారణం, వారసత్వంగా వస్తుంది కూడా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.