Kerala on Covid19: మందుబాబులకు సర్కార్ షాక్.. కరోనా రిపోర్ట్ ఉంటేనే ఇకపై మద్యం
కరోనాకి అస్సలు జడవని వాళ్లెవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చేది మందుబాబులే. వైరస్ గైరస్ జాన్తానై మందే సర్వరోగనివారిణి అన్నది వీళ్ల ఫీలింగ్. కానీ ఇకపై చుక్క పడాలంటే కండిషన్స్ అప్లై అంటోంది కేరళ సర్కార్
కరోనా కష్టకాలంలోనూ ఖజానాకు హెల్ప్ చేస్తున్న వాళ్లెవరంటే మందుబాబులే. మహమ్మారి ఎంత విజృంభిస్తున్నా వెనకడుగే వేయడం లేదు. కరోనా తమకేదో మినహాయింపు ఇచ్చినట్టు మద్యం దుకాణాలు ముందు క్యూ కట్టేస్తున్నారు. మాస్కులేసుకోరు….నిబంధనలు పాటించరు...రాత్రి –పగలు తేడాలేకుండా మద్యం షాపుల ముందు పెద్దజాతరే ఉంటుంది. ఇప్పటికే మద్యం దుకాణాల ముందు రద్దీపై కేరళ హైకోర్టు.... ప్రభుత్వాన్ని నిలదీసింది. కరోనా విజృంభిస్తున్న టైంలో కఠినతరమైన ఆంక్షలేవని ప్రశ్నించింది. ఈ మేరకు స్పందించిన అక్కడి ప్రభుత్వం... మందుబాబులకు కొన్ని ఆంక్షలు విధించింది...
మద్యం దుకాణాల ముందు రద్దీ తగ్గించేందుకు కాస్త కఠినమైన రూల్స్ ఫ్రేమ్ చేసింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకే మందు అమ్మబోతున్నట్టు ప్రకటించింది. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లే లిక్కర్ కొనేందుకు రావాలని సూచించింది. మొదటి డోసు తీసుకున్న వాళ్లు రెండు వారాల తర్వాతే లిక్కర్ షాపు వద్దకు వచ్చి కొనుగోలు చేయాలని స్పష్టంగా తేల్చిచెప్పింది. RT-PCR పరీక్ష చేయించుకుని నెగిటివ్ రిపోర్టు చూపించిన వాళ్లకే మందు అమ్ముతారని ఈ విషయంలో కఠినంగా ఉంటామన్నారు అధికారులు.
అయితే రాష్ట్రంలో అనేక మద్యం దుకాణాల యజమానులు ఇంకా తమకెలాంటి అధికారిక ఆదేశాలు అందలేదని చెప్పారు. కేవలం వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తున్న మెసేజ్‌లే చూశామన్నారు. చివరికి మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది కూడా నిబంధనలు పాటించడం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై మందుబాబులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి చర్య అనిపించడం లేదని...అందరకీ వ్యాక్సిన్ వేయించాలనుకోవడం మంచిదే కానీ ఇలాంటి నిబంధనలేంటని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి కరోనా కల్లోలం గురించి చెప్పుకుంటే దేశం మొత్తం ఓ లెక్క…కేరళ ఒక్కటీ మరో లెక్క అన్నట్టుంది పరిస్థితి. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 44 జిల్లాల్లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉందని ఇప్పటికే కేంద్రం వెల్లడించింది. వారానికి సగటు పాజిటివిటీ రేటు పది శాతానికిపైగా నమోదవుతోందని చెప్పింది. వాటిలో సగానికిపైగా కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయని తెలిపింది. కేరళ ఒక్క రాష్ట్రంలో లక్షమందికిపైగా వైరస్‌తో బాధపడుతున్నారని వెల్లడించింది. వీరిలో సగం మందికిపైగా బాధితులు వ్యాక్సిన్ తీసుకున్న వారే అని సమాచారం.
ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్‌లపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం.. అలాంటి కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని కేరళ ప్రభుత్వానికి సూచించింది. వ్యాక్సిన్లు అందించే రోగనిరోధక శక్తిని బోల్తా కొట్టించే విధంగా వైరస్ మ్యుటేట్ చెందితే అది నిజంగా ఆందోళన కలిగించే విషయమే అవుతుందని ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లో రద్దీ ప్రదేశాల్లో ఆంక్షలు కఠినతరం చేయకుండే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో…మద్యం దుకాణాల వద్దకు వచ్చేవారికి ఈ నిబంధనలు అమలు చేసింది కేరళ ప్రభుత్వం. ఈ నిర్ణయంతో అయినా వైరస్ వ్యాప్తి తగ్గుతుందేమో చూడాలి.