Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్... అందుబాటులోకి రానున్న సింగిల్ డోస్ వ్యాక్సిన్
మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరోనా థర్డ్ వేవ్ త్వరలో ప్రారంభం కానుందని నిపుణులు హెచ్చరించిన తరుణంలో దేశ ప్రజలకు కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో నెమ్మదిగా సాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం కలిసి వస్తుందని కేంద్రం భావిస్తోంది.
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు అమోదం తెలిపినట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవియా శనివారం నాడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని శుక్రవారం ఆ సంస్థ ప్రభుత్వానికి అభ్యర్థన చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సింగిల్ డోస్ వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జాన్సన్ అండ్ జాన్సన్ భారత్‌లో వినియోగంలోకి రానున్న ఐదో వ్యాక్సిన్ కానుంది. యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఆమోదం పొందిన ఐదు టీకాలు భారత్‌లో అందుబాటులో ఉన్నట్టు మంత్రి ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఇప్పటికే భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా ప్రజలకు వేస్తున్నారు. ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్ రాకతో దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
Also Read: Corona Live updates: దేశంలో మరింతగా తగ్గిన కరోనా కేసులు... డెల్టా వైరస్‌తో ప్రమాదం.. శాస్త్రవేత్తల హెచ్చరిక
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1 దాటింది. ఆర్ ఫ్యాక్టర్ 1 దాటుతుందంటే కరోనా వ్యాప్తి పెరుగుతుందని, పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఆర్ ఫ్యాక్టర్ 1.01గా ఉంది. కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఆర్ ఫ్యాక్టర్ పెరగడం నిపుణులను, ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా పెను ప్రభావం చూపిన సెకండ్ వేవ్ సమయంలోనూ 1.4కి ఆర్ ఫ్యాక్టర్ చేరుకుంది. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 40 వేలకు అటుఇటుగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నా.. ఆర్ ఫ్యాక్టర్ మాత్రం 1 ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో మరో కొత్త వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది.
జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్‌ను 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ఇవ్వవచ్చునని కంపెనీ భారత ప్రతినిధి తెలిపారు. దాంతో 18 ఏళ్లు దాటిన వారికి ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి రానుంది. ఇదివరకే 4 టీకాలు ఆమోదం పొందగా.. ప్రస్తుతం భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, సీరం ఇనిస్టిట్యూట్ వారి కోవిషీల్డ్, రష్యా రూపొందించిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మోడెర్నా వాక్సిన్ అనుమతులు పొందగా, భారత్‌లోకి ఇంకా దిగుమతి కాలేదు.
Also Read: డయాబెటిస్ బాధితులు ఆపిల్ తినొచ్చా? ఎలాంటి ప్రభావం చూపుతుంది?