IBS సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఆయుర్వేద నివారణతో ఉపశమనం పొందొచ్చు
ఏది తిన్నా కడుపులో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యని పట్టించుకోకుండా వదిలేస్తే IBS సమస్యగా మారే అవకాశం ఉంది.
నిత్యం కడుపులో నొప్పి, ఏది తిన్నా మంటగా అనిపిస్తుంటే అది అజీర్తి వల్ల అనుకుంటారు. దీర్ఘకాలం పాటు ఇదే సమస్య కొనసాగితే మాత్రం అది ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్(IBS) కిందకి వస్తుంది. జీర్ణశయాంతర పేగు సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. కడుపు తిమ్మిరి, నొప్పిగా అనిపించడం, ఉబ్బరం, గ్యాస్, అతిసారం లేదా మలబద్ధకం రెండూ వస్తాయి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం పొందుతారు.
ఆయుర్వేద నివారణలు
ఐబీఎస్ చికిత్స సులభమైన ఇంటి చిట్కాలకి సంబంధించిన వీడియోని ప్రముఖ పోషకాహార నిపుణులు మున్మున్ గనేరివాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐదు పదార్థాలతో సింపుల్ గా చేసిన ఈ మిశ్రమం తాగితే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. దీన్ని ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
మజ్జిగ- 1 కప్పు
పసుపు పొడి- ¼ టీ స్పూన్
అల్లం- ½ టీ స్పూన్
రుచికి సరిపడ ఉప్పు
కొత్తిమీర
కరివేపాకు పేస్ట్- ½ టీ స్పూన్
స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో మజ్జిగ వేసి కాస్త వేడి చేసి పసుపు పొడి, తురిమిన అల్లం, రాళ్ళ ఉప్పు, కొత్తిమీర తరుగు, కరివేపాకు పేస్ట్ వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకుని తాజాగా ఉన్నప్పుడే తాగాలి.
మజ్జిగ మిశ్రమం వల్ల ప్రయోజనాలు
ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ జీర్ణవ్యవస్థకి మంచిదని అంటారు. ఇందులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి, జీవక్రియని మెరుగుపరుస్తుంది. పేగులని కదిలించి మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. ఐబీఎస్ సమస్య ఉన్న వాళ్ళకి మజ్జిగ ఒక మంచి ఆహారం. అతిసారం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలకి చికిత్స చేయడంలో కరివేపాకు ప్రభావంతంగా పని చేస్తుంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం అతిసారం, మలబద్ధకం నియంత్రించడంలో సహాయపడే కార్బజోల్ ఆల్కలాయిడ్స్‌ను కలిగి ఉంటుంది. ఇక రాళ్ళ ఉప్పు వాడటం వల్ల గుండెల్లో మంట, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలకి అద్భుతమైన ఇంటి నివారణగా పని చేస్తుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. పేగు కదలికలని ప్రోత్సహిస్తుంది. అందులో వేసే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. జీర్ణ, కాలేయ సమస్యలు, చర్మ వ్యాధులు, గాయాలకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
IBS సమస్యకి కారణాలు
ఒత్తిడికి ఎక్కువగా గురి కావడం వల్ల ఐబీఎస్ సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. ఒత్తిడి పేగు ఆరోగ్యంతో ముడి పడి ఉంటుంది. ఎక్కువగా ఒత్తిడికి లోనుకావడం వల్ల కడుపులో మంటగా అనిపిస్తుంది. ఇవే కాకుండా నీరు తక్కువగా తాగడం, ఘాటుగా ఉండే ఆహారాలు అతిగా తీసుకోవడం కూడా శరీరానికి చెడు చేస్తాయి. అజీర్తి సమస్యలు కూడా మరొక కారణంగా నిపుణులు చెబుతున్నారు. అందుకే తగినంత శారీరక శ్రమ అవసరం. అందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. గ్యాస్ ఫామ్ చేసే కార్బొనేటెడ్ పానీయాలకి దూరంగా ఉండాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: చలికాలంలో కీళ్ల నొప్పులు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకోవడం ఎలా?