Contraceptive Pills: గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
అవాంఛిత గర్భాన్ని నియంత్రించేందుకు గర్భనిరోధక మాత్రలు వాడడం ఒక సులభమైన పద్ధతి.
గర్భనిరోధక మాత్రలు అంటే గర్భం రాకుండా అడ్డుకునేవి అని మాత్రమే అనుకుంటారు. అంతకుమించి ఎక్కువ ఆలోచించరు. అవి ఎలా పనిచేస్తాయి? ఏ అవయవాలపై ప్రభావం చూపిస్తాయి? వాటిని ఏ పరిధి మేరకు వాడొచ్చు? లాంటి విషయాలు పట్టించుకోరు. అందుకే వీటిని అధికంగా వాడాక చాలా మంది మహిళల్లో అనేక ఆరోగ్యసమస్యలతో పాటూ, కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఎవరు వాడొచ్చు?
వైద్య నిపుణులు చెప్పినదాని ప్రకారం 25 నుంచి 40 వయసులోపు మహిళలే వీటిని వాడాలి. కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు వీటిని వాడకూడదు. కానీ పదహారేళ్ల వయసు వారు కూడా వీటిని వాడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. వారిలో పునరుత్పత్తి వ్యవస్థ పూర్తిగా ఎదగదు. అలాంటి వారు వీటిని వాడడం వల్ల ఆ వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. హార్లోన్లు కూడా అసమతుల్యంగా మారిపోతాయి. భవిష్యత్తులో గర్భం దాల్చడం కష్టతరం అవుతుంది. అంతేకాదు గర్భాశయంలో కలిగే ఎండోమెట్రియోసిస్, పాలిసిస్టిక్ అండాశయ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
ఎప్పుడు వాడొచ్చు?
ఎప్పుడు పడితే అప్పుడు ఈ మాత్రలను వాడేయకూడదు. అత్యవసరపరిస్థితుల్లో నెలలో ఒకటి లేదా రెండు సార్లకు మించి వీటిని వాడకూడదు. అధికంగా వాడితే వీటి ప్రభావం వెంటనే కనిపించే అవకాశం ఉంది. నెలసరి క్రమం తప్పడం, హర్మోన్లలో హెచ్చుతగ్గులు ఏర్పడి మానసిక సమస్యలు తలెత్తడం కనిపిస్తాయి. తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి, వికారంగా అనిపించడం వంటివి అనిపిస్తాయి. చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి మాత్రలు వాడే వారిలో భవిష్యత్తులో పుట్టే పిల్లలు జన్యుపరమైన సమస్యలతో జన్మించే అవకాశం ఉంది.
మూడ్ స్వింగ్స్ ఎక్కువవుతాయి?
అప్పటికప్పుడే ఆనందం, వెంటనే కోపం చిరాకు... ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఈ మాత్రలు వాడడం వల్ల అధికమవుతాయి. మనిషికి ఇవి మానసికంగా కుంగుబాటుకు గురిచేస్తాయి. మహిళలు బరువు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి గర్భనిరోధక మాత్రలు ఉపయోగించుకుండా ఉండడం ఉత్తమం. వాడినా కూడా చాలా తక్కువగా వినియోగించాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: రోజుకు రెండు ఆపిల్స్ మించి తింటే ఇవిగో ఈ రోగాలొచ్చే అవకాశం
Also read: ఆ విటమిన్ లోపిస్తే డిప్రెషన్, మతిమరుపు, లోపించకుండా ఏం తినాలంటే