కరోనా సమయంలో అద్భుతమైన సేవలు, ప్రకృతి వైద్య రంగంలో దేశానికే ఆదర్శం ఆ ఆసుపత్రి
ప్రకృతి వైద్యాన్ని బలోపేతం చేయడం కోసం అత్యాధునిక వసతులతో అమీర్ పేట్ నేచర్ క్యూర్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నారు.
అమీర్‌పేట నేచర్ క్యూర్ ఆసుపత్రిని ప్రభుత్వం రూ. 10 కోట్లతో అభివృద్ధి చేసింది. ప్రకృతి వైద్యాన్ని బలోపేతం చేయడం కోసం అత్యాధునిక వసతులతో ఆసుపత్రిని పునరుద్ధరించారు. సౌకర్యాల ప్రారంభ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
సనాతన భారతీయ వైద్యానికి ప్రోత్సాహం- హరీష్ రావు
కరోనా వంటి క్లిష్టసమయంలో అద్భుతమైన సేవలు అందించిన నేచర్ క్యూర్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు మంత్రి హరీష్ రావు. అత్యాధునిక సౌకర్యాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అధ్యయన నివేదిక ప్రకారం ప్రకృతివైద్యంలో ఈ ఆసుపత్రిని నెంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైద్యరంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ.. ఆయుష్ చికిత్సలోనూ అగ్రస్థానంలో ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయని హరీష్ రావు తెలిపారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
అసలు ఏంటీ నేచర్ క్యూర్ స్పెషాలిటీ?!
సాధారణంగా ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా అలోపతి వైపు పొలోమని పరుగులు పెడతాం! వేలకు వేలు సమర్పించుకుని, లక్షలకు లక్షలు ధారపోసి, వెంటిలేటర్ నుంచి బతుకుజీవుడా అని ఇంటిలెటర్ వైపు వస్తాం! అదికూడా లక్కు బాగుంటేనే! ఆ తర్వాత సైడ్ ఎఫెక్టులు, వీక్లీ చెకప్పులు, మింగలేని కక్కలేని మందులు, వాటికోసం వందలు వేలు అప్పులు! ఇదీ నయాజమానా తీరు! ఇందులో ఎవరినీ తప్పు పట్టడానికి లేదు! ఎవరి ఆప్షన్ వాళ్లది! ఎవరి యాక్షన్ వాళ్లది! అలాంటి డిమాండున్న సిట్యువేషన్‌లో, ప్రకృతి వైద్యానికి స్పేస్ లేదు! కానీ ఆ స్పేస్‌ని లాక్కుంది అమీర్‌పేట నేచర్ క్యూర్ హాస్పిటల్! ప్రకృతిని ఒకచేతపట్టి, సంజీవనిని మరోచేత పట్టుకుకుని సగర్వంగా నిలబడింది!
కరోనా సమయంలో వెలకట్టలేని సేవలు
అమీరుపేట డీకే రోడ్డులో రైల్వే లైనుకు ఆనుకుని, పచ్చటిచెట్ల నడుమ ఉంటుంది. ఇలాంటి హాస్పిటలొకటి ఇక్కడ ఉందంటే నమ్మశక్యం కాదు! 10 ఎకరాల సువిశాల స్థలంలో, 1949లో ఏర్పాటు చేశారు. ఇందులో మూడు కేటగిరీల్లో పేషెంట్లకు సేవలందిస్తారు. 1- జనరల్ వార్డు, 2- స్పెషల్ వార్డు, 3- కాటేజీలు! మామూలు రోజుల్లో ఎంతమందికి ఈ హాస్పిటల్ తెలుసో లేదోకానీ, కరోనా తర్వాత ఒక్కసారిగా దీని విలువేంటో తెలిసొచ్చింది. ఎందుకంటే కోవిడ్ టైంలో ఈ ఆసుపత్రి అమ్మకంటే ఎక్కువ లాలించింది. ఇంటివారి కంటే ఎక్కువ ఆదరించింది. వీరు అందించిన క్వారెంటైన్ సేవలను పేషెంట్లు ఎప్పటికీ మరువలేరు. ఆ సంక్షోభ సమయంలో అయినవారు సైతం దూరంగా ఉంటే, నేచర్ క్యూర్ ఆసుపత్రి మేమున్నామంటూ చేయిచాచింది. వైద్యులు, సిబ్బంది బంధువులై సపర్యలు చేశారు. 8 వేలకు పైగా కరోనా పాజిటివ్ పేషెంట్లకు క్వారెంటైన్ సేవలు అందించిన ఘనత ఈ ఆసుపత్రి సొంతం. మూడు పూటలా పౌష్టికాహారం, కషాయం, మందులు ఇస్తూ, యోగా చేయిస్తూ, కోవిడ్ పేషెంట్లకు సొంతింట్లో ఉన్నామన్న అనుభూతిని కలిగించింది. 30 వేలకు పైగా RT-PCRపరీక్షలు నిర్వహించింది.
నవరత్నాల్లాంటి చికిత్సలు
ప్రతి సంవత్సరం 3000 మంది ఇన్ పేషెంట్లు, 10 వేల మంది ఔట్ పేషెంట్లు ఈ హాస్పిటల్ రికార్డు! కాటేజీ కావాలంటే కనీసం నెల రోజుల ముందు బుక్ చేసుకోవాలి! వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చికిత్స పొందుతుంటారు. ప్రకృతితో వైద్యం, పంచభూతాలతో వైద్యం. పూర్తి భారతీయ వైద్య సిద్దాంతం. ఆయుర్వేదం, నేచురోపతి, యోగా, హోమియోపతి, యునాని, సిద్ధ పద్ధతిలో చికిత్స అందిస్తుంటారు. నేచురోపతి అంటే కంప్లీట్ డ్రగ్ లెస్ హీలింగ్ సిస్టం. పూర్తిగా సహజ పద్ధతిలో దీర్ఘకాలిక రోగాలకు చికిత్స అందిస్తారు. డయాబెటిస్, బీపీ, ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పులు, పీసీఓడీ, నడుంనొప్పులు, పెరాలిసిస్, సయాటిక, అధికబరువు, థైరాయిడ్, డిస్క్ సమస్యలు, సోరియాసిస్ ఇలా అనేక క్రానిక్ డిసీజ్‌లకు సైతం చికిత్స ఉంటుంది. సౌర చికిత్స, జలచికిత్స, మర్దన చికిత్స, మట్టి చికిత్స లాంటివి ఇందులో స్పెషాలిటీ. మొత్తం తొమ్మిది రకాల థెరపీలు ఇక్కడ అందిస్తారు. ఇవన్నీ నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంటాయి.
- మానిపులేటివ్ థెరపీ (మసాజ్)
- హైడ్రో థెరపీ
- మడ్ థెరపీ
- క్రోమా థెరపీ
- యోగా థెరపీ
- ప్రాణాయామం
- ఫిజియోథెరపీ
- మాగ్నెటోథెరపీ
- డైట్ థెరపీ
పంచభూతాలన్నీ పరమౌషధాలుగా మారుతాయి
మారిన జీవన శైలి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. టార్గెట్లవైపు తీస్తున్న పరుగు ఆయుష్షుని లాగేస్తున్నది. క్రమంగా లైఫ్ స్టైయిల్ డిసీజెస్ బారిన పడుతున్నారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా, పెద్దరోగాలకు ద్వారాలు తెరుస్తున్నారు. అలాంటి వారికి నేనున్నానని నేచర్ క్యూర్ ఆసుపత్రి స్వాగతం పలుకుతున్నది. ఈ హాస్పిటల్‌కి వస్తే మందుల వాసన రాదు. మట్టివాసన అనుభూతి కలుగుతుంది. ఈ వార్డుల్లో తిరుగుతుంటే ఇన్‌ఫెక్షన్ భయం ఉండదు.. ఇమ్యూనిటీ పెరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ హాస్పిటల్ ఆవరణలో ఉంటే అవయవాలన్నీ మన ఆధీనంలో ఉన్నాయన్న ధైర్యం కలుగుతుంది. ఇక్కడి గాలి ఔషధమే. ఇక్కడి నీరు ఔషధమే, మట్టి ఔషధమే, నిప్పు ఔషధమే! పంచభూతాలన్నీ పరమౌషధాలుగా మారుతాయి. ఇక్కడికి వస్తే ఏదో పిక్నిక్ స్పాట్‌కి వచ్చినట్టు.. విహారయాత్రలో తిరుగుతున్నట్టు.. ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే బాగుండు.. అనిపిస్తుంది.
ప్రకృతి వైద్య రంగంలో దేశానికే ఆదర్శంగా
ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ అనే మాటే ఉండదిక్కడ. ఇన్ పేషెంటుగా ఉన్నవారికి మంచి భోజనం అందిస్తారు. వారివారి రోగాలకు సంబంధించిన చికిత్సలో భాగంగా ప్రత్యేక ఆహారం అందిస్తారు. నూనెలు, మసాలాలు, ఉప్పు, కారాలు లేకుండా ఉంటాయి. జ్యూస్, సలాడ్ వంటివి టైం టు టైం అందిస్తారు. బరువు తగ్గాలనుకున్న వారికి పత్యేకంగా లిక్విడ్ డైట్ అందిస్తారు. 1949లో స్థాపించిన ఈ ప్రకృతి చికిత్సాలయం, ప్రకృతి వైద్య రంగంలో దేశానికే ఆదర్శంగా ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలలో చదువుకున్న వారు దేశంలోని ప్రముఖ ప్రకృతి చికిత్సాలయాల్లో పని చేస్తుండటం మరో చెప్పుకోదగ్గ విషయం.