TDP Janasena Alliance: ఎన్నికల్లో జనసేనకు ఏకంగా 63 స్థానాలు! క్లారిటీ ఇచ్చిన టీడీపీ
TDP Janasena Seat Sharing: టీడీపీ 112 స్థానాల్లో బరిలోకి దిగనుండగా, పొత్తులో ఉన్న జనసేన 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయని ఓ ప్రకటన వెలువడింది.
Seat sharing between TDP and Janasena: అమరావతి: ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయని తెలిసిందే. ఇదివరకే పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల పంపకాలపై భేటీ అయి చర్చలు జరిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సీట్ షేరింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 112 స్థానాల్లో బరిలోకి దిగనుండగా, పొత్తులో ఉన్న జనసేన 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయని ఓ ప్రకటన వెలువడింది. కానీ అందులో నిజం లేదని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది.
ఆ ప్రకటనలో ఏముందంటే..
‘తెలుగుదేశం పార్టీకి సార్వత్రిక ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి. ఈ ఎన్నికలే రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రజల కోసం పోరాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఈ నియంత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. అయినా మన నాయకుడు ఎంతో ధైర్యంతో ప్రజల కోసం పోరాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడమే టీడీపీ ధ్యేయం. ఈ క్రమంలో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే జనసేన పార్టీతో పొత్తును ప్రకటించడం జరిగింది.
ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదన్న సదుద్దేశంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ప్రభుత్వ దుర్విధానాలపై నిరంతరం ప్రశ్నిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో జనసేన ఎంతో బలపడింది. కనుక పొత్తులో భాగంగా టీడీపీ 112 అసెంబ్లీ స్థానాలు, జనసేన 63 స్థానాల్లో బరిలోకి దిగాలని రెండు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం, రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెలుగుదేశం గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరం పనిచేద్దాం’ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు విడుదల చేసినట్లుగా ఈ ప్రకటన విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
Fake News Alert #YCPFakeBrathuku #2024JaganNoMore#WhyAPHatesJagan #AndhraPradesh pic.twitter.com/e9Gjm1MOwf
— Telugu Desam Party (@JaiTDP) January 24, 2024
Fact Check: టీడీపీ, జనసేన సీట్ల పంపకాలపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ లో వెల్లడించింది. ఆ ప్రకటన ఫేక్ న్యూస్ అని పార్టీ నేతలు, కార్యకర్తలను అలర్ట్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది.